విజయవాడ: మూడు రాజధానులా.. అమరావతా అనే విషయమై రెఫరెండానికి తాను సిద్దంగా ఉన్నానని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. 

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.   మూడు రాజధానులా, అమరావతి ఒక్క రాజధాని కావాలా అనే విషయమై ప్రజల వద్దకు రెఫరెండానికి వెళ్లాలని చంద్రబాబునాయుడు వైసీపీకి గురువారం నాడు సవాల్ విసిరారు. ఈ సవాల్ పై  వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా స్పందించారు. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూడ స్పందించారు.

also read:రాజీనామాకు సిద్దం: బాబు సవాల్‌‌కు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా 'సై'

రెఫరెండానికి సిద్దమై తాను  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. చిత్తశుద్ది లేని మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

ధైర్యముంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకొందామని ఆయన వైసీపీ ప్రజాప్రతినిధులకు సవాల్ విసిరారు. ప్రజలు మూడు రాజధానులకు అనుకూలంగా ఓటేస్తే చంద్రబాబు,తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన తేల్చి చెప్పారు.