అమరావతి: మూడు రాజధానుల అంశంపై చంద్రబాబు విసిరిన రెఫరెండం సవాల్ ఏపీ రాజకీయాల్లో హీట్ ను పెంచింది.టీడీపీ చీఫ్ సవాల్ కు వైసీపీ ఎమ్మెల్యే స్పందించారు. జగన్ ఆదేశిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని గుంటూరు జిల్లా ఎమ్మెల్యే ముస్తఫా శుక్రవారం నాడు ప్రకటించారు.

also read:చంద్రబాబుకు సజ్జల కౌంటర్: ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి

మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరులో వైసీపీ శుక్రవారం నాడు ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్తాఫా, నాగార్జునలు పాల్గొన్నారు. మూడు రాజధానులకు ప్రజలు ఒప్పుకొంటే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొంటానని చంద్రబాబు ప్రకటించారు.

ఈ విషయమై గుంటూరు జిల్లా ఎమ్మెల్యే ముస్తఫా శుక్రవారం నాడు స్పందించారు. జగన్ ఆదేశిస్తే  తాను తక్షణమే రాజీనామా చేస్తానని చెప్పారు. బాబు రెఫరెండం సవాల్ ను స్వీకరించేందుకు తాను సిద్దమన్నారు. 

చంద్రబాబు హయంలో ఈ ప్రాంతానికి నష్టం జరిగిందన్నారు. ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. 

రెఫరెండం కోసం తాను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని ఆయన చెప్పారు.  జగన్ ఆదేశించిన క్షణంలోనే తాను సిద్దంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.