Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ లాంటిదే అచ్చెన్నాయుడిపై కేసు: టిడిపి ఎమ్మెల్యే సంచలనం

రాష్ట్రంలో బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల నేత‌లే టార్గెట్ గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం క‌క్ష సాధింపు చ‌ర్యల‌కు దిగ‌డం దుర్మార్గమని రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్రసాద్ అన్నారు. 

TDP MLA Anagani Satyaprasad Fires on YSRCP
Author
Guntur, First Published Jul 30, 2020, 9:56 PM IST

గుంటూరు: రాష్ట్రంలో బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల నేత‌లే టార్గెట్ గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం క‌క్ష సాధింపు చ‌ర్యల‌కు దిగ‌డం దుర్మార్గమని రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్రసాద్ అన్నారు. వాస్తవాల‌ను వ‌క్రీక‌రించి బ‌ల‌మైన బీసీ నాయ‌కుల‌ను అరెస్ట్ చేయ‌డంపై పెట్టిన శ్రద్ధ.. ఏ ఒక్క రోజు కూడా పాల‌న‌పై చూప‌లేక‌పోయారని మండిపడ్డారు.

'చంద్రబాబునాయుడు ఇంట్లో పింక్ డైమండ్ ఉంద‌ని గ‌తంలో ఏవిధంగా అయితే దుష్ప్రచారం చేశారో.. అచ్చెన్నాయుడి కేసులోనూ రూ. వేల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని అసత్య ప్రచారం చేశారు. ఇలా ఆయ‌న‌పై ప‌గ‌ తీర్చుకుంటున్నారు. కేవ‌లం రూ. 11 ల‌క్షలు మాత్రమే అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన కేసులో... అందులోనూ ప్రమేయం లేని అచ్చెన్న పేరు చేర్చి వేధింపుల‌కు గురిచేస్తున్నారు'' అని అన్నారు. 

''విజిలెన్స్ ఎన్‌ఫోర్స్మెంట్ నివేదికలో ఆయన పేరు ప్రస్తావ‌నే లేదు. ఏసీబీ పేర్కొన్న నివేదికలో కూడా అచ్చెన్నపై నేరుగా ఆరోపణలు లేవు. కేసులో అచ్చెన్నాయుడు పాత్రే లేనప్పుడు ఆయన‌పై ఈ క‌క్ష సాధింపు చ‌ర్యలు ఎందుకు..? టెలీహెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి డైరెక్టర్, కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న ప్రమోద్ రెడ్డిని నేటికీ ఎందుకు అరెస్ట్ చేయ‌డం లేదు..? ఇదెక్కడి న్యాయం..?'' అని ప్రశ్నించారు. 

READ MORE   కరోనా విజృంభణ వేళ.... విజయనగరంలో ఎస్పీ రాజకుమారి కాలినడక

''తప్పుడు సాక్ష్యాలతో అచ్చెన్నాయుడు, కొల్లు ర‌వీంద్రల‌ను అరెస్ట్ చేశారు. పక్కా సాక్ష్యాలు దొరికినా వైసిపి నాయకులను అరెస్ట్ చేయరు. హవాలా సూత్రధారి బాలినేని శ్రీనివాస‌రెడ్డి, జడ్జిపై దాడి సూత్రధారి పెద్దిరెడ్డిపై చర్యలేవి..? రాష్ట్రంలో టిడిపికో న్యాయం, వైసిపికి ఇంకో న్యాయమా..?'' అని నిలదీశారు. 

''బీసీలంటే ప్రభుత్వానికి ఎందుకంత చుల‌క‌న‌..? ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు. ఇంతమందిని తప్పుడు కేసులలో ఇరికించి జైళ్లకు పంపలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను వేధించడంపై చూపుతున్న శ్రద్ధలో ప‌దో వంతు కూడా కరోనా పేషెంట్ ల‌పై చూప‌డం లేదు. మీ దాష్టికానికి చివ‌ర‌కు ప్రజాప్రతినిధులు జైళ్లలో.. ప్రజ‌లు రోడ్లపైన అల‌మ‌టిస్తున్న దుస్థితి క‌ల్పించారు'' అని సత్యప్రసాద్ మండిపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios