విజయనగరం పట్టణంలో  కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్ డౌన్ అమలు తీరును జిల్లా ఎస్పీ బి. రాజకుమారి స్వయంగా పర్యవేక్షించారు. గురువారం పట్టణంలోని  కోట జంక్షను నుండి కేవీ టెంపుల్ వరకు కాలిబాటన వెళుతూ పలు ప్రాంతాలను సందర్శించి, భద్రతను సమీక్షించారు. లాక్ డౌన్ సమయం పూర్తయినా తెరిచివుంచిన షాపులను దగ్గరుండి మరీ మూయించారు. అనవసరంగా బయటకు రావద్దని, బహిరంగ ప్రదేశాలల్లో తిరిగే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, చేతులను సబ్బుతోను, శానిటైజరుతో శుభ్రంగా కడుక్కోవాలని ప్రజలను ఎస్పీ సూచించారు. 

కరోనా వ్యాధి రోజు రోజుకు విస్తరిస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తలనొప్పి, కండరాల నొప్పి, ఛాతీ నొప్పి, గొంతు నొప్పి, వాసన కోల్పోవడం, ఒళ్ళు నొప్పులు, గొంతు బొంగురు పోవడం, ఆకలి లేకపోవడం, విరోచనాలు, దగ్గు, జ్వరం, త్వరగా అలసిపోవడం, నీరసం, తాము ఎక్కడ ఉన్నామో కూడా తెలియని కన్ఫ్యూజనులో ఉండడం, కడుపునొప్పి వంటివి కరోనా వ్యాధి లక్షణాలన్నారు. ఈ తరహా లక్షణాలు కనిపించినపుడు ఆశ్రద్ధ చేయవద్దని... వెంటనే వైద్యుల్ని సంప్రదించాలన్నారు. 

read more  మనసు కలుక్కుమనే దుర్ఘటన...అరగంటలో బెడ్ కేటాయిస్తే?: చంద్రబాబు (వీడియో)

కోవిడ్ 19 వైరస్ మన శరీరంలోకి చేరిన తరువాత మన శారీరక స్థితిని బట్టి ప్రభావం చూపిస్తుంది... కావున ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఈ వ్యాధి నుండి బయటపడేందుకు టెన్షను పడకుండా ఉండాలన్నారు. డాక్టరు సూచనలతో శ్వాస వ్యవస్థను మెరుగుపర్చుకొనేందుకు శ్వాసకు సంబంధించిన ఎక్సర్ సైజులు, యోగా, మెడిటేషను చేయాలని సూచించారు.  

వ్యాధి లక్షణాలు కనిపించ ముందే మనలో వైరస్ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఇంటి నుండి తరుచూ బయటకు వెళ్ళివచ్చే వ్యక్తులు తాము ఇంటిలో ఉన్నపుడు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. వ్యాధికి గురైనవారు భయానికి గురైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందన్నారు. కావున వ్యాధికి గురైన వారు ఆందోళనకు గురికావద్దన్నారు. వ్యాధి పట్ల
 అవగాహన పెంచుకొంటూ ఆవిరి పట్టడం, బలవర్ధకరమైన ఆహారం తీసుకోవాలని, శక్తిని పెంచుకొనేదుకు విటమిన్ ట్యాబ్లెట్లు కూడా వైద్యుల సలహాతో తీసుకోవాలన్నారు ఎస్పీ.

విజయనగరం జిల్లా ఎస్పీ వెంట ట్రాఫిక్ డిఎస్పీ ఎల్. మోహనరావు, విజయనగరం 1వ పట్టణ సిఐ జె.మురళి, ట్రాఫిక్ సిఐ టి.వి. తిరుపతిరావు, సిసిఎస్ సిఐ కాంతారావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.