చూడబోతే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేందుకు చంద్రబాబునాయుడు మంత్రులు, నేతలకు టైం టేబుల్ ఫిక్స్ చేసినట్లు అనుమానంగా ఉంది.
చూడబోతే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేందుకు చంద్రబాబునాయుడు మంత్రులు, నేతలకు టైం టేబుల్ ఫిక్స్ చేసినట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే, ప్రతీ రోజు ముగ్గురో, నలుగురో మంత్రులు మీడియా సమావేశాలు పెట్టటం జగన్ పై విరుచుకుపడటం అలవాటుగా మారిపోయింది. ఎప్పుడైతే ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారో అప్పటి నుండి మాటలదాడి మరింత పెరిగింది. యాత్ర ప్రారంభమయ్యే నవంబర్ 6వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మాటాల దాడి మరింత ఉధృతమవుతోంది.

జగన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్ధం కావటం లేదని ఓ మంత్రి అంటే, పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అసలు జగన్ కైనా తెలుసా అంటూ మరో మంత్రి ప్రశ్నిస్తున్నారు. జగన్ పాదయాత్ర ఉద్దేశ్యాన్ని జగన్ తో పాటు వైసీపీ నేతలు ఇప్పటికే కొన్ని వందల సార్లు చెప్పినా పాపం చంద్రబాబుతో పాటు మంత్రులకు ఎందుకు అర్ధం కావటం లేదో ?
ఎంతసేపు ఆవు వ్యాసం లాగ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారని, లక్ష కోట్లు దోచేసారని, జైలుకు ఎప్పుడు వెళతారో కూడా తెలీదని, జగన్ శుక్రవారం బహిరంగ సభ పెట్టగలడా? అంటూ...ఇలా అర్ధం లేని ఆరోపణలు, సవాళ్ళతో అరిగిపోయిన రికార్డులనే వినిపిస్తున్నారు.

దానికితోడు మంత్రుల ఆరోపణలకు జగన్ ఎక్కడా స్పందించకపోయేసరికి వారు మరింత రెచ్చిపోతున్నారు. మొత్తానికి పాదయాత్ర అనగానే మంత్రుల్లో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది. జగన్ పై ఆరోపణలు, సవాళ్ళు గుప్పించటంలో మంత్రుల్లో అచ్చెన్నాయుడు, కెఎస్ జవహర్, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, నిమ్మకాయల చిన్నరాజప్ప, ఆది నారాయణరెడ్డి, అమరనాధ్ రెడ్డి ముందు వరసలోనే ఉంటారు.
గతంలో పీతల సుజాత, రావెల కిషోర్ బాబు మంచి దూకుడు మీదుండేవారు. ఎప్పుడైతే మంత్రిపదువులు పోయాయో అప్పటి నుండి వారి గొంతు మూగబోయింది. పాదయాత్రకు ముందే మంత్రుల మాటల దాడి ఈ విధంగా ఉంటే రేపు యాత్ర మొదలైన తర్వాత వీళ్ళ దాటి ఇంకెంతలా ఉంటుందో?
