టిడిపి మైండ్ గేమ్ దారుణంగా రివర్స్ అయ్యింది. కొద్ది రోజులుగా వంగవీటి రాధాకృష్ణ వైసిపిని వీడుతారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. దానికి కొనసాగింపుగా బుధవారం ఉదయం నుండి రాధా వైసిపిలో నుండి టిడిపిలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో ఒకటే హడావుడి మొదలైంది. పైగా ఈనెల 22వ తేదీ ముహూర్తం అంటూ ఒకటే హోరెత్తింది.

అంతేనా, రాధాను టిడిపిలోకి చేర్చుకోవటంలో చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారని, రాధాకు ఎంఎల్సీ పదవి ఇస్తాననని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాధా టిడిపిలో చేరుతున్నారన్న ప్రచారంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని కాపు నేతలందరూ టిడిపిలో చేరిపోతున్నారని, వైసిపికి పెద్ద దెబ్బే అంటూ సోషల్ మీడియాలో తెగ హడావుడి జరుగుతోంది.

సీన్ కట్ చేస్తే మధ్యాహ్నానికి సీన్ రివర్స్ అయ్యింది. రాధా వైసిపిని వదిలేసి టిడిపిలో చేరుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదంటూ వంగవీటి రాధా పేరుతో ముందు వైసిపి తర్వాత విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాకు స్పష్టం చేశారు. సాయంత్రం రాధా కూడా మీడియాతో మాట్లాడుతారని రంగా-రాధా మిత్రమండలి సభ్యుడు అడపాశేషు ప్రకటించారు. సాయంత్రం ఇదే విషయాన్ని రాధానే స్వయంగా మీడియాతో చెబుతారంటూ శేషు ప్రకటించటం గమనార్హం.

వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రాధ వైసిపిలోనే ఉంటారన్నారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని కొట్టిపారేసారు. రాధా పార్టీ మారుతారన్న ప్రచారం కేవలం టిడిపి ఆడుతున్న మైండ్ గేమ్ గా మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రలో పెరుగుతున్న క్రేజ్ ను దెబ్బతీయటానికి చంద్రబాబు ఆడుతున్నగేమ్ మాత్రమే అన్నారు. తమ మధ్య ఎటువంటి విబేదాలు లేవన్నారు. తమతో రాధా మాట్లాడుతూ, తన తండ్రిని టిడిపి పోట్టనపెట్టుకున్న టిడిపిలోకి ఎలా వెళతానంటూ చెప్పేవారని వెల్లంపల్లి గుర్తు చేశారు.