తెదేపా మేయరు అభ్యర్థిగా కోవెలమూడి
అమరావతి : గుంటూరు నగర పాలకసంస్థ ఎన్నికల్లో తెదేపా తరఫున మేయరు అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ఆ పార్టీ ఖరారు చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నగర పాలకసంస్థ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
అమరావతి : గుంటూరు నగర పాలకసంస్థ ఎన్నికల్లో తెదేపా తరఫున మేయరు అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ఆ పార్టీ ఖరారు చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నగర పాలకసంస్థ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
జిల్లా నాయకుల అభిప్రాయాలను తీసుకుని, మేయరుగా కోవెలమూడి రవీంద్ర(నాని)పేరు ఖరారు చేశారు. డివిజన్ల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులపై చర్చించారు. కొన్నిచోట్ల అభ్యర్థిత్వాల ఖరారుపై అక్కడ నామినేషన్లు వేసినవారితో శుక్రవారం మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు.
పశ్చిమ నియోజవకర్గంలో పెండింగ్‌లో ఉన్న నాలుగు డివిజన్లకు సంబంధించి స్పష్టత వచ్చింది. ఇక్కడ పోటీలో ఉన్న ఒకరిని తప్పుకోమని చెప్పడం ద్వారా మిగిలిన డివిజన్ల అభ్యర్థుల ఎంపికకు మార్గం సుగమమైంది. తూర్పు నియోజకవర్గం పరిధిలో మూడు డివిజన్లపై సమాలోచనలు చేశారు.
ఇప్పటికే పోటీలో ఉన్నవారిలో కొందరు తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని దీనిపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో చర్చించి ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. ఒకే డివిజన్‌లో ఒకరి కంటే ఎక్కువమంది పోటీలో ఉన్నచోట స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించారు.
అభ్యర్థుల ఖరారు పూర్తయిన వెంటనే బీ-ఫారాలు అందని వారికి వెంటనే ఇవ్వనున్నారు. నిత్యాసవర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వంటి అంశాలను నగరవాసులకు వివరించి అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. మేయరు అభ్యర్థిత్వంపై స్పష్టత రావడంతో పార్టీ శ్రేణులు మరింత ముమ్మరంగా ప్రచారంలో ముందుకెళ్లాలని నేతలు చెప్పారు.
గుంటూరు నగరపాలకసంస్థ ఏర్పడిన తర్వాత మూడుసార్లు ఎన్నికలు జరగ్గా రెండుసార్లు మేయరు పదవిని తెదేపా దక్కించుకుంది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ సారి మేయరు పీఠాన్ని తెదేపా దక్కించుకునే దిశగా కార్యకర్తలను సమాయత్తం చేసి ముందుకు నడిపించే బాధ్యతను జిల్లా నేతలకు అప్పగించారు.