అమరావతి: ఏపీ శాసనమండలిలో చోటు చేసుకొన్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోపలువురు కేంద్ర మంత్రులను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేయాలని టీడీపీ భావిస్తోంది.

పాలనా వికేంద్రీకరణ బిల్లు,  సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. అయితే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా బులెటిన్ విడుదల చేయలేమని సెక్రటరీ పంపిన నోట్‌పై ఏపీ శాసనమండలి ఛైర్మెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోపుగా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయకపోతే చర్యలు తప్పవని ఛైర్మెన్ షరీఫ్ గురువారం నాడు సెక్రటరీకి లేఖ రాశారు.

మరో వైపు 14 రోజుల్లోపుగా సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయనందున  ఈ రెండు బిల్లులు కూడ పాస్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ శాఖల మంత్రులను కలవాలని భావిస్తున్నారు. 

ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీలో ఈ ఏడాది జనవరి 27వ తేదీన తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ శాసనమండలి రద్దుపై పార్లమెంట్ ఉభయ సభల్లో  ఆమోదం పొందాల్సి ఉంది.  ఏపీ సీఎం  ఈ నెల 12వ తేదీన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సమయంలో ప్రధాని మోడీతో చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.