కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో ముసలం పుట్టింది. ఈ నియోజకవర్గంలోని గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలుకావడంపై పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

కుప్పం నియోజకవర్గంలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సమీక్షించేందుకు గాను టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు మంగళవారం నాడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పార్టీ కీలక నేతల తీరుపై  పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓటమి పాలైందనే విషయమై చర్చించారు.

కొందరు కార్యకర్తలు స్థానికంగా ఉన్న నేతల తీరుపై ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్పిపల్ ఎన్నికల్లో వైసీపీకి ధీటుగా సమాధానం చెప్పాలని కార్యకర్తలు కోరారు.టీడీపీ ముఖ్య నేతల తీరుపై కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో సమావేశంలో గందరగోళ పరిష్థితులు నెలకొన్నాయి. దీంతో ముఖ్య నేతలు సమావేశం మధ్యలో వెళ్లిపోయారు.

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసేందుకు సిద్దమయ్యారు.టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాస్ రెడ్డి రాజీనామాకు సిద్దపడ్డారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ పదవికి మణిరత్నం రాజీనామా చేయాలని భావిస్తున్నారు. మరో వైపు చంద్రబాబు వద్ద పీఏ బాధ్యతల నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా మనోహార్ ప్రకటించారు.

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ 14 గ్రామపంచాయితీలను మాత్రమే కైవసం చేసుకొంది. ఈ నియోజకవర్గంలో అత్యధిక గ్రామ పంచాయితీలను వైసీపీ దక్కించుకొంది.