ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అయితే.. అసెంబ్లీ సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో.. ప్రతిపక్ష టీడీపీ నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలిరోజు సభ  25 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. నోటిఫికేషనులో పేర్కొన్న సమయానికంటే ఆలస్యంగా సభ ప్రారంభమవ్వడాన్ని టీడీపీ ప్రశ్నించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న సమయం కంటే 25 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. ఈ విధంగా గతంలో ఎప్పుడు జరగలేదని టీడీపీ తెలిపింది.  

ఇదిలా ఉంటే, అసెంబ్లీ ప్రారంభానికి ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ధర్నా నిర్వహించారు.  నీటిలో తడిచిన వరి కంకులతో చంద్రబాబు నాయుడు నిరసన చేపట్టారు. ధర్నా అనంతరం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ర్యాలీగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

ఇదిలా ఉండగా.. 

ఏపీ అసెంబ్లీలో మీడియాపై ఆంక్షల పెట్టడం మీద స్పీకర్ తమ్మినేనికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాల్లో లేని ఆంక్షలు మీడియాపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

శాసనసభ శీతాకాల సమావేశాలకు మీడియాను అనుమతించకపోవడం, మీడియా పాయింట్‌ను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగస్వామి అయిన మీడియాను నిషేధించడం అప్రజాస్వామికం అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 

ఆదివారం ఆయన దీనిపై శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఒక లేఖ రాశారు. ‘‘ప్రజా సమస్యలపై చట్ట సభల్లో జరిగే చర్చలను ప్రజలకు చేర్చడంలో మీడియా పాత్ర కీలకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే శిక్షించాలని ఆదేశిస్తూ గతంలో ఈ ప్రభుత్వం జీవో 2430 జారీచేసింది. ఇప్పుడు చట్ట సభల్లోకి మీడియాను అనుమతించకపోవడం అంతకంటే దారుణమైన చర్య’’ అని లేఖలో పేర్కొన్నారు. 

చట్ట సభల్లో చర్చలను, ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలిని ప్రజలకు చేర్చిన ఘనత టీడీపీదేనని, 1998లో దేశంలో మొదటిసారిగా టీడీపీ ప్రభుత్వం చట్ట సభల కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసిందని పేర్కొన్నారు. దీని కొనసాగింపుగా పార్లమెంటులో కూడా ఇదే తరహా ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించారని తెలిపారు.

అయితే ఇప్పుడు మీడియాపై ఇలా నిషేధం విధించడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. కాగా, శాసనసభ సమావేశాల కవరేజికి ఏబీఎన్‌, ఈటీవీ, టీవీ5లను అనుమతించకపోవడం అప్రజాస్వామికమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.