హిందూపురం లోక్‌సభలో టీడీపీ పరిస్ధితి గందరగోళంగా మారింది. ఈ పార్లమెంట్ స్థానానికి ఎవరిని బరిలో దింపాలనే దానిపై హైకమాండ్‌కు తలనొప్పులు ఎదురవుతున్నాయి. బీసీ సామాజిక వర్గాల ఆధిపత్యం అధికంగా వుండే హిందూపురంలో బీసీ నేతనే బరిలోకి దించాలని తెలుగుదేశం పెద్దలు భావిస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార ప్రతిపక్షాలు అభ్యర్ధుల ఎంపిక, నిధుల సమీకరణ, ప్రచార వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ గేమ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా ముందున్నారు. అభ్యర్ధుల వడపోత, మార్పులు, చేర్పులతో ఆయన రాష్ట్ర రాజకీయాన్ని హీటెక్కించారు. సర్వేలు, పనితీరు ఆధారంగా టికెట్లు కేటాయిస్తూ .. గెలవరని తేలితే చాలు ఎంతటి ఆత్మీయులనైనా పక్కనపెట్టేస్తున్నారు. ఎన్నికల ముందు వచ్చే తలనొప్పులు, అసంతృప్తులను ముందే ఎదుర్కోని ఎలక్షన్ నాటికి పార్టీలో ప్రశాంత వాతావరణం వుండేలా చూసుకోవాలన్నది జగన్ టార్గెట్.

ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల విషయంలో పరిస్ధితులు ఇలా ఉంటే లోక్‌సభ టికెట్ల పైనా పలువురు ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా ఢిల్లీలో అధ్యక్షా అనాలని కలలు కంటున్న వారు కోకొల్లలు. అధికార, ప్రతిపక్షాల్లోని ఆశావహులు ఇందుకోసం పైరవీలు మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో హిందూపురం లోక్‌సభలో టీడీపీ పరిస్ధితి గందరగోళంగా మారింది. ఈ పార్లమెంట్ స్థానానికి ఎవరిని బరిలో దింపాలనే దానిపై హైకమాండ్‌కు తలనొప్పులు ఎదురవుతున్నాయి. బీసీ సామాజిక వర్గాల ఆధిపత్యం అధికంగా వుండే హిందూపురంలో బీసీ నేతనే బరిలోకి దించాలని తెలుగుదేశం పెద్దలు భావిస్తున్నారు. 

టీడీపీ నుంచి బోయ, కురుబ, చేనేత సామాజిక వర్గాల నేతలు హిందూపురం ఎంపీ సీటును ఆశిస్తున్నారు. ఈ రేసులో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, అంబికా లక్ష్మీనారాయణలు ముందున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన అంబిక.. అనంతర పరిణామాలతో టీడీపీలో చేరారు. అయితే ఆయనకు పార్టీ ఏ ఎన్నికలోనూ టికెట్ కేటాయించలేదు. ఈసారి మాత్రం తనకు హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించాలని అంబికా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన బోయ వర్గానికి చెందిన వ్యక్తి. ఇక నేసే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. లేనిపక్షంలో తనకు పెనుగొండ అసెంబ్లీ టికెట్‌పైనా కేటాయించాలని నిమ్మల డిమాండ్ చేస్తున్నారు. 

అంబికా, నిమ్మలతో పాటు హిందూపురం రేసులో మరికొందరు నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో సామకోటి ఆదినారాయణ, సవితమ్మ, బీకే పార్థసారథిలు కుదిరితే అసెంబ్లీకి లేదంటే పార్లమెంట్‌కు తమను పంపాలని గట్టిగా పట్టుబడుతున్నారు. హిందూపురం అసెంబ్లీ టికెట్ ఎట్టిపరిస్ధితుల్లోనూ నందమూరి బాలకృష్ణకే .. ఇందులో మరో ఆలోచన లేదు.

ఎటోచ్చి లోక్‌సభ స్థానంతోనే తోనే టీడీపీకీ చిక్కులు వచ్చే అవకాశం వుంది. టికెట్ ఆశిస్తున్న వారిలో ఒకరికి టికెట్ ఇస్తే.. మరొకరు అసంతృప్తి రాగం వినిపిస్తారు. ఇది పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని చంద్రబాబు భయపడుతున్నారు. అసలే ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో కావడంతో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని ఆయన భావిస్తున్నారు. మరి హిందూపురం పంచాయతీని టీడీపీ చీఫ్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.