పామర్రు : పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు సొంత నియోజకవర్గంలో భంగపాటు ఎదురైంది. కల్పనపై అసమ్మతిగళం ఒక్కసారిగా ఉప్పెనలా ఎగిసిపడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కల్పనకు టికెట్ ఖరారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె ప్రత్యర్థి వర్గం చంద్రబాబును కలిసింది. 

నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన అసంతృప్తులు భారీ సంఖ్యలో చంద్రబాబు 30 కార్లలో ఉండవల్లి వెళ్లి చంద్రబాబును కలిశారు. ఎమ్మెల్యే కల్పన తీరుపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కల్పన వైసీపీ నుంచి టీడీపీలో చేరినప్పటి నుంచి పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని, ఆమె తీరుపట్ల టీడీపీ క్యాడర్ ఇబ్బంది పడినట్లు ఆరోపించారు. 

వైసీపీ నేతలకే కల్పన ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారని చంద్రబాబుకు చెప్పుకొచ్చారు. సీనియర్లను విస్మరిస్తున్నారని, అట్రాసిటీ కేసులు అక్రమంగా పెట్టిస్తున్నారని సీఎంకు వివరించినట్లు అసమ్మతి నేతలు తెలిపారు. కల్పనకుగానీ, ఆమె భర్త దేవిప్రసాద్‌కుగానీ పామర్రు అసెంబ్లీ టికెట్‌ కేటాయించొద్దని కోరారు. 

అసంతృప్తుల ఫిర్యాదుపై స్పందించిన చంద్రబాబు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో చర్చించాలని ఆదేశించారు. దీంతో మంత్రులు రామకృష్ణుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడును కలిసి కల్పనపై ఫిర్యాదు చేశారు. 

ఇదిలా ఉంటే పామర్రు టికెట్ కల్పనకే ఇవ్వాలంటూ దేవరపల్లి టీడీపీ మండల కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కల్పన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, రూ.15 కోట్ల వరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను తెచ్చి పేద రోగులకు సహాయం అందించారని గుర్తు  చేశారు.  

అయితే అత్యధికంగా ఐదు మండలాల నేతలు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై ఫిర్యాదు చెయ్యడం సంచలనంగా మారింది. టికెట్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇలా అసంతృప్తి సెగ తాకడంతో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.