Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఫెయిల్, మరి ఏపీలో...: పొత్తులపై టీడీపీలో గందరగోళం

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాలపై యావత్ దేశమంతా ఎంతో ఆసక్తిగా చూసింది. ఒకవైపు థర్డ్ ఫ్రంట్ అంటూ కేసీఆర్, మరోవైపు బీజేపీయేతర కూటమి అంటూ చంద్రబాబు నాయుడు పోటాపోటీగా జాతీయ రాజకీయాల్లో హల్ చల్ చేశారు. 

tdp leaders apposing alliance with congress in andhrapradesh
Author
Amaravathi, First Published Dec 12, 2018, 9:15 PM IST

అమరావతి: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాలపై యావత్ దేశమంతా ఎంతో ఆసక్తిగా చూసింది. ఒకవైపు థర్డ్ ఫ్రంట్ అంటూ కేసీఆర్, మరోవైపు బీజేపీయేతర కూటమి అంటూ చంద్రబాబు నాయుడు పోటాపోటీగా జాతీయ రాజకీయాల్లో హల్ చల్ చేశారు. 

అంతేకాదు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తుపెట్టుకుని బరిలోకి నిలవడం ఒకవైపు, కేసీఆర్ ఒక్కరే ఒంటరిగా బరిలో నిలవడంతో అన్ని పార్టీలు యావత్ దేశమంతా ఓకన్నేసింది. 

అయితే ఫలితాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలోనే అత్యధిక స్థానలు కైవసం చేసుకుని ప్రజాకూటమికి చుక్కలు చూపించింది. తెలంగాణలో ఎన్నికలు పూర్తై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఇక తన దృష్టి అంతా జాతీయ రాజకీయాలపైనే అంటూ స్పష్టం చేశారు. 

తాజాగా తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఏపీలో టీడీపీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయా అన్నది చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు బొక్క బోర్లా పడటంతో ఏపీలో కూడా సీన్ సితారేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు సక్సెస్ అయితే సేమ్ సీన్ ఏపీలో రిపీట్ చేయవచ్చునని ఏపీ సీఎం చంద్రబాబు భావించారు. కానీ బొమ్మ తిరగబడింది. చంద్రబాబు నాయుడు అంచనాలు తారుమారయ్యాయి. ప్రజాకూటమిని ప్రజలు ఆదరించలేదు. దీంతో  పొత్తుని ప్రజలు అంగీకరించలేదని ప్రచారం జరుగుతోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఏం జరుగుతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 

ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్న తమ్ముళ్ళు తెలంగాణా ఫలితాలతో ఇక బహిరంగంగా విమర్శించే అవకాశాలు కనబడుతున్నాయి. 

ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుపై సీనియర్ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టలూడదీసుకొడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే చాలామంది కరుడుగట్టిన టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా పైకి మాత్రం నోరు మెుదపలేదు. కానీ లోలోన మాత్రం రగిలిపోయారు.  

ఇప్పుడు వారంతా తెలంగాణలో ఫలితాలను చూసి ఏపీలో పొత్తుకు ససేమిరా అనే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది పొత్తును తెలంగాణ వరకే పరిమితం చెయ్యాలని కూడా పలువురు కోరారు కూడా. పార్టీ నేతల అభిప్రాయాలను ఒకవేళ చంద్రబాబు నాయుడు గౌరవిస్తే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.  

గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ తో పొత్తు ఉంటుందని ఆశపడుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో విభజన పుణ్యమా అంటూ చతికిలపడ్డ కాంగ్రెస్ కి చంద్రబాబు తోడుతో కాస్త ఊపిరిపోసుకోవచ్చునని భావించారు. కనీసం కొన్ని సీట్లు అయినా గెలిచి ఉనికిని చాటుకోవచ్చునని ఆశపడ్డారు. 

తెలంగాణలో వచ్చిన ఫలితాలతో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ ససేమిరా అనే ఛాన్స్ లేకపోలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొత్తుపై ఏం తేలుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో మంచి ఫలితాలు వచ్చి ఉంటే బాగుండేదని కానీ రాలేదంటూ నిరాశతో ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios