ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజన్న రాజ్యం తెస్తామంటే రైతులు భయపడిపోతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు.  సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 14వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తూ ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని, పెండింగ్ రుణమాఫీని ప్రభుత్వం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైతు కష్టాలను ఇడ్లీ, ఉప్మాలతో పోల్చే వైసీపీకి చిత్తశుద్ధి ఉందా? అని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.

ఇదే విషయంపై గుంటూరులో మీడియాతో మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడారు. జగన్ పాలనలో రైతులకు అన్నివిధాలా అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. రైతులకు సకాలంలో విత్తనాలు, నీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఏపీలో విత్తనాలు తీసుకువెళ్లి తెలంగాణలో పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.

రుణమాఫీ చివరి రెండు విడతలు ఎందుకు ఇవ్వరంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు రుణమాఫీ ప్రకటించారు కాబట్టి రైతులకు అన్యాయం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా.. కేవలం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయటంపైనే దృష్టి సారించిందని విమర్శించారు.

 గత ప్రభుత్వ అవినీతిపై ఆధారాలు ఉంటే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ది గాలికి వదిలిపెట్టి.. టీడీపీపై కక్ష్య సాదింపే లక్ష్యంగా పనిచేస్తున్నారని, లక్షల కోట్లు అవినీతి అని ప్రచారం చేశారని, ఒక్కరూపాయి అయినా నిరూపించారా? అని ఆలపాటి రాజా ప్రశ్నించారు.