ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగగా... రెండో రోజు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే... ఈ స్పీకర్ ఎన్నికపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అధికార పార్టీకి బలమున్నా... ప్రతి పక్ష పార్టీకి సమాచారం ఇవ్వడం సంప్రదాయమని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి సమాచారం ఇచ్చామని ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేశారు. స్పీకర్ బాధ్యతల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించే యోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. 

ఇదిలా ఉండగా.. స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకి ఎంతో అనుభవం ఉంది. ఆయన ఆరుసార్లు ఆముదాల వలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకే ఆ పదవిని జగన్ అప్పగించారు.