వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంపై విమర్శల వర్షం కురిపించారు టీడీపీ నేత, మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు. మంగళవారం మీడియాతో మాట్లాడిన  ఆయన కొత్త పారిశ్రామిక విధానంలోని లోపాలు ఎత్తిచూపారు.

దీని వల్ల భవిష్యత్ తరాలకు, ఉపాధి కల్పనకు పెద్దగా ఒరిగేదేమీ లేదని యనమల పేర్కొన్నారు. 14 నెలల విలువైన కాలం వృధా చేసింది ఈ పాలసీ కోసమా..? అని ఆయన ప్రశ్నించారు.

ఏపీ సర్కార్ చేసే పనుల వల్లే పారిశ్రామక రంగంలో మైనస్ 2.2 శాతం వృద్ధి సాధించారని విమర్శించారు. నిర్మాణ రంగం, తయారీ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలన్నీ తిరోగమనడంలోనే పయనిస్తున్నాయని రామకృష్ణుడు పేర్కొన్నారు.

Also Read:అన్నీ డ్రామాలే.... 13 జిల్లాల్లో అభివృద్ధంతా గ్రాఫిక్సే: షేమ్ బాబూ అంటూ విజయసాయి ట్వీట్

వైసీపీ అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి దిక్కులేనివారయ్యారని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా సగం జీతాలనే ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.

క్రెడిట్ రేటింగ్ పడిపోయి... పెట్టుబడులన్నీ ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని యనమల ఆరోపించారు.

బలహీన వర్గాల వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశాన్ని జగన్ ప్రభుత్వం నీరుగార్చిందని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని రామకృష్ణుడు హెచ్చరించారు.