అమరావతి: కాకినాడ సెజ్ పై జగన్మోహన్ రెడ్డి కన్నేయడం ఇవాల్టిది కాదని... కోన ప్రాంతాన్ని కబళించాలన్నది జగన్ 14ఏళ్ల కల అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్రయత్నం చేయగా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని...దీంతో తమ పార్టీపై ఆయన కక్ష గట్టారని అన్నారు. 

''జగన్ సీఎం కాగానే మళ్లీ బినామీ సంస్థలతో కోన ప్రాంతాన్ని కైంకర్యం చేసే కుట్రలు చేస్తున్నారు. సిబిఐ ఛార్జిషీట్లలో సహ నిందితులే బినామీలుగా భూముల ఆక్రమిస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డికి  విజయ సాయి రెడ్డి బినామీ అయితే ఆయనకు అల్లుడు ''అరబిందో'' రోహిత్ రెడ్డి. ఇలా ఎ1 కు బినామీ ఎ2 అయితే ఎ2కు బినామీ  అరబిందో అల్లుడు'' అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

''ఎ2, ఎ3ల మధ్య వియ్యం జగద్విదితమే. తండ్రి హయాంలో జరిగిన భూమాయే, ఇప్పుడు కొడుకు పాలనలోనూ జరుగుతోంది. అప్పటి మోసం మరిచిపోకముందే ఇప్పుడు మళ్లీ కోన రైతాంగాన్ని జగన్ మోసం చేస్తున్నారు. అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు చేతిలో బాధితులు కోన రైతాంగమే'' అని అన్నారు. 

read more   విద్యుత్ మీటర్లు పెట్టి చూడు...ఏం జరుగుతుందో: జగన్ కు నారాయణ వార్నింగ్

''తనవి కాని భూములపై 4రెట్ల లాభంతో బినామీల ముసుగులో జగన్ పరమయ్యాయి. ఇలా భూముల యజమానులైన రైతుల నోళ్లలో మట్టి కొట్టడం హేయం. రూ5వేల కోట్ల విలువైన కోన భూములు బినామీల పేర్లతో జగన్ హస్తగతం చేసుకుంటున్నారు. కాకినాడ సెజ్ విక్రయ లావాదేవీల లాభం రూ 4,700కోట్లలో సగం స్థానిక రైతులకే ఇవ్వాలి'' అని యనమల ప్రభుత్వాన్ని కోరారు.  

''ఎ1, ఎ2, ఎ3 ల మధ్య  బినామీ అవినీతి లావాదేవీలపై దర్యాప్తు జరపాలి. పార్లమెంటు ఆమోదించిన కొత్త బినామీ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలి. కాకినాడ సెజ్ లో బల్క్ డ్రగ్ పరిశ్రమ పెడితే కోనప్రాంతం కాలుష్య కాసారంగా మారుతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి" అని యనమల డిమాండ్ చేశారు.