అమరావతి: వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పదని సుప్రీంకోర్టు తీర్పు రుజువు చేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు.  

బుధవారం నాడు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తోందనే విషయాన్ని సీఎం జగన్ గుర్తించాలని ఆయన హితవు పలికారు.

 సుప్రీం తీర్పుతో  సీఎం జగన్ మేల్కోవాలని ఆయన సూచించారు. ఎన్నికల సంఘానికి విస్తృత అధికారాలు ఉన్న విషయాన్ని న్యాయస్థానం మరోసారి గుర్తు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకొని ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే 

స్థానిక సంస్థల  ఎన్నికలను వాయిదా వేయాలని ఏపీ  రాష్ట్ర ఎన్నికల  సంఘం నిర్ణయం తీసుకోవడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబడుతోంది.  ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీడీపీ మాత్రం స్వాగతించిన విషయం తెలిసిందే.కరోనా వ్యాధి నివారణకు పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొంటే సరిపోతోందని సీఎం వైఎస్ జగన్ ప్రకటనలపై  టీడీపీ తీవ్ర విమర్శలకు దిగుతోంది.