విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ట్రాప్ లో పడ్డారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించిన వైయస్ జగన్ నేడు ప్రారంభోత్సవానికి ఎలా వెళ్తారంటూ విరుచుకుపడ్డారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇండియా పాకిస్థాన్ లా మారిపోతాయని జగన్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ జగన్ చేసిన జలదీక్షను బయటపెట్టారు.

కాళేశ్వరంప్రాజెక్టు పూర్తైతే ఇరు రాష్ట్రాల్లో నీటి యుద్ధాలు వస్తాయని జగన్ అన్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆనాడు జగన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యల వీడియోను విడుదల చేశారు. 

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్‌లో మ్యూజియంగానే మిగిలిపోతుందన్నారు. ఇకపోతే కాకినాడలో గురువారం కాపు సామాజిక వర్గం నేతలమంతా సమావేశమైనట్లు తెలిపారు. హాజరైన నేతలు ఎవరూ పార్టీ మారరని చెప్పుకొచ్చారు వేదవ్యాస్.