తన బావ అనిల్ కుమార్ కోసమే వైఎస్సార్ సిపి నాయకుడు జగన్ టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నారని టిడిపి నేత వర్ల రామయ్య ఆరోపించారు. తెలంగాణలో బ్రదర్ అనిల్ కుమార్ కు చెందిన రక్షణ స్టీల్ కంపనీ అనుమతుల కోసం జగన్ టీఆర్ఎస్ పంచన చేరారని...అందుకు కేసీఆర్ నుండి హామీ కూడా పొందారని వర్ల వివరించారు. 

తెలంగాణలో కేసీఆర్ విజయానికి జగన్, పవన్ లే కారణమని వర్ల పేర్కొన్నారు. వారి వల్ల గెలిచినందున కేసీఅర్ ఏపిలో చంద్రబాబును ఓడించడానికి ప్రయత్నిస్తానని  అంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల జగన్, పవన్ లకు కృతజ్ఞతలు చెబుతున్నారని వర్ల వెల్లడించారు. 

తెలంగాణలో వున్న తమ ఆస్తులను కాపాడుకోడానికి జగన్, పవన్ లు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏపికి వచ్చి వారి తరపున ప్రచారం చేసినా ప్రయోజనమేమీ  ఉండదన్నారు. చంద్రబాబు మరోసారి ఏపి సీఎం కావడం ఖాయమని వర్ల రామయ్య ధీమా వ్యక్తం చేశారు.