వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అరెస్టు ప్రభుత్వం హై డ్రామా నడిపించిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఒక బూటకపు అరెస్టు చేసి హై డ్రామా తెరకెక్కించారని ఆయన అన్నారు. ఆదివారం విజయవాడలోని టీడీపీ ఆఫీసులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 

ఒక ప్రభుత్వ అధికారిని బెదిరించి, ఆమె ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డాడని.. తాగిన మత్తులో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశాడని  చెప్పారు.  సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో దుశ్చర్యకు పాల్పడిన ఒక ఎమ్మెల్యేను తెల్లవారుజామున 5 గంటలకు అరెస్టు చేసినట్లుగా చూపించారని అన్నారు.

ఉదయం 5గంటలకు అరెస్టు చేసి...11 గంటలకు బెయిల్‌ ఇచ్చి పంపడం విడ్డూరంగా ఉందన్నారు.  ఇది నాటకం కాకపోతే ఇంకేమిటి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యే విషయంలో చాలా సీరియస్‌ అయ్యారని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారని శనివారం రాత్రి టీవీల్లో చూసి నిజంగానే న్యాయం చేస్తారనుకున్నానని వర్ల పేర్కొన్నారు.

కానీ కురుక్షేత్రంలో ధర్మరాజుతో ‘అశ్వద్ధామ హతః’ అని అబద్ధం చెప్పించినట్లు జగన్‌ కూడా... చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్లు మీడియా ముందు నటించి, జిల్లా యంత్రాంగాన్ని ఒక డ్రామా ఆడమన్నట్లు డైరెక్షన్‌ ఇచ్చారని ఆరోపించారు.  అందుకే పోలీసు యంత్రాంగం చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు పెట్టి వెంటనే ఎమ్మెల్యేను వదిలేసింది అని వర్ల ఆరోపించారు. 

చట్టప్రకారం ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే ఉద్దేశం ఉంటే... ఒక ఇంటిలోకి చొరబడినందుకు ఐపీసీ 452, విధి నిర్వహణలోని ప్రభుత్వ ఉద్యోగిపై దౌర్జన్యం చేసినందుకు ఐపీసీ 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలన్నారు. అవి నాన్‌ బెయిలబుల్‌ కేసులని, అప్పుడు ఎమ్మెల్యేను జైలుకు పంపేవాళ్లని చెప్పారు. కానీ ఎవరి ఆదేశాల ప్రకారం ఈ కేసులు పెట్టలేదో పోలీసు అధికారులు చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.