చిత్తూరు: చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ వ్యహారం రాజుకుంటోంది. రీపోలింగ్ కి వైసీపీ సై అంటుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం నై అంటోంది. అంతేకాదు రీ పోలింగ్ ఓ కుట్ర అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. 

దీంతో అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాల్ ప్రతిసవాల్ తో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ సందర్భంగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సవాల్ విసిరారు. 

రీపోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించిన ఆమె ఓటమి భయంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించడానికి అడ్డదారులు తొక్కుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

పోలింగ్ జరిగిన మరుసటి రోజే తాము 25 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని స్పందించిన ఈసీ చెవిరెడ్డి ఫిర్యాదు చేస్తే స్పందిచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదు చోట్ల రీపోలింగ్ కే కాదు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు తాము సిద్ధమని అందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిద్ధమా అంటూ సుధారెడ్డి సవాల్ విసిరారు.