వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా.. వేసవి విడిది కోసం కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన దోచుకున్నది దాచుకోవడానికే స్విట్జర్లాండ్ వెళ్లారంటూ...టీడీపీ నేత, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.

బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. టీటీడీ బంగారాన్ని కూడా వైసీపీ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో ఏం జరిగినా రాబందుల్లా బయటికి వచ్చిన వారు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు మరణిస్తే.. ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

ఏపీలో విద్యార్థుల గురించి మాట్లాడిన పెద్ద మనుషులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.ఏపీలో ఏదైనా చిన్న తప్పు జరిగి విద్యార్థి ఏమైనా చేసుకుంటే మమ్మల్ని, మా అధికారుల్ని, మా ప్రభుత్వాన్ని, మా పార్టీని, మా మంత్రుల్ని బతకనిచ్చేవాళ్లా అని ప్రశ్నించారు. గవర్నర్‌ దగ్గరికో, రాష్ట్రపతి దగ్గరికో, ప్రధాని దగ్గరికో వెళ్లి మెమొరాండాలు ఇచ్చేవాళ్లు.. ప్రెస్‌మీట్లు పెట్టేవాళ్లు, నిరాహార దీక్షలు, ధర్నాలు, ముక్కులు చీదేవాళ్లు, ఎగ పీల్చేవాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. ఈ రోజు ఎందుకు మాట్లాడటం లేదని ఆ పెద్ద మనుషుల్ని నిలదీస్తున్నానన్నారు.

ఇదే సమయంలో ఎన్నికల సంఘంపైనా రాజేంద్ర ప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డడారు. మంత్రి మండలి నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై రివ్యూ చేసే అధికారం సీఎస్‌కు ఎక్కడది అని ప్రశ్నించారు.