అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పట్టాభిరామ్ కారు అద్దలను దుండగులు పగులగొట్టారు. శనివారం అర్థరాత్రి ఆ ఘటన జరిగింది. ఇంటి బయట పెట్టిన కారు ముందు, వెనక అద్దాలని పగులగొట్టారు. ఈ ఘటనపై పట్టాభిరామ్ స్పందించారు.

తన నివాసం వెలుపల ఉన్న కారును ధ్వంసం చేశారని పట్టాభిరామ్ చెప్పారు. వైసీపీ అవినీతిని బయటపెడుతున్నందు వల్లనే తన కారును ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. తన నివాసం పక్కన హైకోర్టు న్యాయమూర్తి నివాసం కూడా ఉందని అన్నారు. 

అక్కడ పోలీసు పికెట్ ఉన్నప్పటికీ కారుపై దాడి చేశారని చెప్పారు. కారును ధ్వంసం చేసినంత మాత్రాన తాను భయపడే ప్రసక్తి లేదని పట్టాభిరామ్ అన్నారు. తాను పిరికి పందను కానని అన్నారు. ఎక్కడో సర్వే రాళ్లు తీసుకుని వచ్చి కారు అద్దాలు పగులగొట్టారని ఆయన చెప్పారు. 

తన నోరు మూయించాలని చూస్తే తాను భయటపడనని అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పట్టాభిరామ్ నివాసానికి చేరుకుని పరిశీలించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై పట్టాభిరామ్ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.