Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ స్టేషన్‌లో కరెంట్ తీసేసి కొట్టారు.. ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాను: టీడీపీ నేత పట్టాభి

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌ ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. తనపై పోలీసు స్టేషన్‌లో దాడి జరిగిందని చెప్పారు.

Tdp Leader Pattabhi Says he was beaten in thotlavalluru police station
Author
First Published Mar 4, 2023, 4:03 PM IST

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌ ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. తనపై పోలీసు స్టేషన్‌లో దాడి జరిగిందని చెప్పారు. బీసీ వర్గాల వ్యక్తికి మద్దతు తెలిపేందుకు తాను గన్నవరం వెళ్లానని చెప్పారు.  పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్రమంగా కేసుల్లో ఇరికించారని తెలిపారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‎లో అర్ధరాత్రి కరెంటు తీసేసి తనను కొట్టారని ఆరోపించారు. తనపై ఇప్పటికే నాలుగు  సార్లు దాడి జరిగిందని.. అయినా ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. 

పట్టాభికి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. పట్టాభి హత్యకు కూడా కుట్ర జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా కక్షపూరితం గా ఉంటే న్యాయ వ్యవస్థ లు చూస్తూ ఊరుకోవని అన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులుపెట్టి వేదించాలనుకోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు. పట్టాభిపై ప్రభుత్వం దుర్మార్గపు విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. గన్నవరం ఘటనకు సంబంధించి పట్టాభితో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి  తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయానికి వచ్చిన గొడవ అదుపు చేసేందుకు వచ్చిన తనపై దాడి చేసి గాయపరిచారని గన్నవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కనకరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టు పట్టాభికి, టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పట్టాభి, ఇతర టీడీపీ నేతల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టులో వాదనలు వినిపించారు.

ఈ కేసులో పట్టాభితో సహా టీడీపీ నేతలకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల చొప్పున పూచికత్తు ఇవ్వాలని ఆదేశించింది. పట్టాభి సహా టీడీపీ నేతలు మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలనే షరతు విధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios