విజయవాడ: ముఖ్యమంత్రి జగన్ కు ప్రజల ప్రాణాలకంటే రాజకీయాలే ముఖ్యమని, రమేష్ కుమార్ పై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కు తీసుకోవాలని, జగన్ బ్రెయిన్ లోని ఫాక్షన్ వైరస్ కు మందు లేదని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత పంచుమర్తి అనురాధ అన్నారు. రక్షణ కోసం యుద్ధంలో చనిపోయిన సైన్యానికి మనమంతా నివాళులు అర్పించడమే కాకుండా సెల్యూట్ కూడా చేస్తామని ఆమె అన్నారు. 

ఈరోజు కరోనా బారిన పడిన లక్షలాది ప్రజలను మనం చూస్తున్నామని, ప్రపంచమంతా అల్లాడిపోతోందని, లక్షలాదిమంది చనిపోయారని, 17 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు ప్రపంచమంతా నమోదయ్యాయని, ప్రజలు వణికిపోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఉండాలని ఆమె అన్నారు. ఏపీ ఓటర్లు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక నిర్ణయం తీసుకుని ఎన్నికలకు వాయిదా వేస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన్ను తొలగించే ప్రయత్నం చేశారని,  దీన్ని బట్టి వీళ్లకు ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉందా అనే అనుమానం ప్రతిఒక్కరిలో కలుగుతోందని ఆమె అన్నారు. 

Also Read: జగన్ గారూ....బాబు వస్తానంటే అలా అన్నారు, కనగరాజు ఎలా వచ్చారు: అచ్చెన్న

ఈరోజు వైద్యులు ఎంత బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసునని, కరోనా బారిన పడకుండా ఉండేందుకు వైద్యులు, నగర కమిషనర్ చేయగలిగినంత చేశారని, ఒక్క ప్రాణాం కూడా పోకుండా ప్రయత్నిస్తున్న వారిని సస్పెండ్ చేసే పరిస్థితికి ముఖ్యమంత్రి వచ్చారంటే ఇది ఉన్మాది చర్య కాక ఇంకేమిటని అనురాధ అన్నారు. వైద్యుల మీద ప్రతీకారం తీసుకునే సందర్భమా ఇది అని ప్రశ్నించారు. మాస్కులు ఇమ్మనేగా వైద్యులు అడిగింది...అదేదో నేరమైనట్టు ఓ దళిత డాక్టర్ ను సస్పెండ్ చేశారని ఆమె విరుచుకుపడ్డారు. చీపుర్లు కూడా లేవన్నందుకు నగర కమిషనర్ ను సస్పెండ్ చేశారని ఆమె గుర్తు చేశారు. 

కరోనా బారిన పడకూడదని ఎన్నికలు వాయిదా వేసినందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారని ఆమె అన్నారు. ఏపీలో 1200 శాతం పైగా కరోనా ప్రబలుతోంటే కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. 11 జిల్లాల్లో 133 ప్రదేశాల్లో రెడ్ జోన్లుగా ప్రకటిస్తే వాటిని రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ లోకి ఎలా తీసుకురావాలని సమీక్ష చేసి ఒక పాలసీ మేటర్ గా తీసుకుని ప్రజలందరికీ గైడ్ చేయకుండా ఈ ముఖ్యమంత్రి పగకు , ప్రతీకారానికి, కక్షలకు ప్రాధాన్యత ఇవ్వడమేమిటని అడిగారు. 

ఒక మనిషి స్వేచ్ఛగా ఆరు రోజులపాటు తిరిగితే 3, 500 మందికి సోకే ప్రమాదం ఉందని స్వయంగా వూహాన్ గవర్నర్ చెప్పారని,  జాగ్రత్తగా ఉండాల్సిన ఈ స్థితిలో కరోనా విషయంలో సీరియస్ గా ఉన్న వారిని మీరు సస్పెండ్ చేస్తూ ఇంకోపక్క కరోనా బాధితులకు సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కరోనా కట్టడికి సలహాలు ఇస్తున్నా మీరు పట్టించుకోవడం లేదని అన్నారు. కక్ష, ప్రతీకారాలు తప్పించి ముఖ్యమంత్రికి ఏమీ పట్టవా అని అడిగారు. కర్నూలులో కోయిలగండ్ల నిరంజన్  అనే వైద్యుడు రక్షణ పరికరాల కోసం హైకోర్టును ఆశ్రియించారని అనురాధ గుర్తు చేశారు. 

కరోనా బాధితులకు సేవ చేస్తున్న వారందరికీ ఎన్ -95 మాస్కులు, గ్లౌజులతో పాటు అన్ని రక్షణ పరికరాలు అందించాలని కోర్టు ఆదేశించిందని ఆమె గుర్తు చేస్తూ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన వారానికి డాక్టర్ ను సస్పెండ్ చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యమని అడిగారు. కరోనా బారిన పడి జనం చనిపోతే నవరత్నాలు పెద్దగా ఇవ్వాల్సిన అవసరం ఉండదని జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టున్నారని వ్యాఖ్యానించారు.  

మూడు కోట్ల మంది ఓటర్లను కరోనా బారిన పడకుండా ఆపిన నిమ్మగడ్డ రమేష్ కు మరొకరైతే అవార్డులు ఇస్తారు. కానీ వారిని తొలగించేందుకు ఆర్డినెన్స్ ను జగన్ తీసుకొచ్చారాంటే ప్రజల బాగోగులు పట్టవని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.. జగన్మోహన్ రెడ్డి తన పద్దతి మార్చుకోవాలని అన్నారు. రక్షణ పరికరాలు లేకుండా వైద్యం చేస్తున డాక్టర్లకు మనోవేదన ఉండదా అని అనురాధ అడిగారు. వైద్యం చేయాలా లేక ఇంట్లోనే ఉండాలా అనే ఆందోళన డాక్టర్లలో ఉందని ఆమె అన్నారు. పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. 

రోజుకో మంత్రి మాట్లాడ్డం, వెళ్లిపోవడం ...ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని గెలిపించిందని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కుల ద్వేషాలను రెచ్చగొట్టడం, మంత్రులు బూతులు తిట్టడం రోజూ ఇదే తంతు అని ఆమె అన్నారు. చంద్రబాబు ఎక్కడున్నారు అని మంత్రులు అడుగుతున్నారని అని అంటూ చంద్రబాబు ఎక్కడుంటే మీకెందుకు? వైసీపీ బ్యాచ్ ఏం కావాలని కోరుకుంటోంది? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారా? లేక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనికిరారని చేతులెత్తేశారా అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.  ఆ ప్రశ్నలకు వైసీపీ వాళ్లు సమాధానం చెప్పాలని అన్నారు.

ఎంతసేపూ కక్ష సాధింపులేనా? .మాస్కులు అడిగితే సస్పెండ్ చేసేస్తారా...ప్రజల ప్రాణాలకంటే మీకు ఎన్నికలే ముఖ్యమా...115  రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం అధికారులను అక్కడికి ఎందుకు పంపినట్టు అని ఆమె అడిగారు. బిక్కబిక్కుమని ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతుంటే వారికి రక్షణ కల్పించకుండా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తే జనం చూస్తూ ఊరుకోరని అన్నారు. 

కక్ష సాధించడానికి ఇది సమయం కాదని అనురాధ అన్నారు. కరోనా తీవ్రతను అర్ధం చేసుకుని చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తనకేమీ సంబంధం లేతన్నట్టు ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్స్ ఆడుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇసుక దందా కొనసాగించడం , పర్మిట్లు లేకపోయినా మైనింగ్ పనులు సాగించడం, యూనివర్సిటీల్లో వీసీలను నియమించేయడం ఇవన్నీ ముఖ్యమంత్రి చేయాల్సిన పనులేనా అని అడిగారు. 

జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. కరోనా వైరస్ కు రెండు మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ వస్తుందేమో కానీ, జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ లో ఉన్న ఫ్యాక్షన్ వైరస్ కు మందు లేదని అన్నారు. శాసనమండలి విషయంలోనూ ఇదే తీరుగా జగన్ వ్యవహరించారని, శాసనమండలి రద్దు చేసేశారని అన్నారు. 

ప్రజలు ప్రాణభయంతో ఉన్న సమయంలో రాజకీయాలు చేయకూడదని తెలుగుదేశం మిన్నుకుందని, కానీ దాన్ని చేతకానితనంగా తీసుకుని ఇష్టానుసారం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఆమె అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనికిరాని కులరాజకీయాలను తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టొద్దని సూచించారు.