Asianet News TeluguAsianet News Telugu

స్వామినాథన్ మృతిపై చంద్రబాబు విచారం... జైలునుండే సంతాపం : ములాఖత్ తర్వాత నారాయణ

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి నారాయణ కలిసారు. 

TDP Leader Narayana mulakat with chandrababu AKP
Author
First Published Sep 29, 2023, 4:28 PM IST | Last Updated Sep 29, 2023, 4:30 PM IST

రాజమండ్రి : భారత హరితవిప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ మరణవార్త చంద్రబాబును చాలా బాధించిందట. ఈ క్రమంలో స్వామినాథన్ కుటుంబసభ్యులకు తన సంతాపం తెలపాలని సూచించినట్లు మాజీ మంత్రి నారాయణ తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు నారాయణ కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సమయంలోనే స్వామినాథన్ వ్యవసాయ రంగానికి చేసిన సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారని నారాయణ తెలిపారు. 

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ పదవిలో వున్నా... ఎక్కడున్నా ప్రజల గురించే ఆలోచిస్తుంటారని నారాయణ అన్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నా చంద్రబాబు తనగురించి ఆలోచించుకోవడం లేదని... రాష్ట్రం, ప్రజలు గురించే ఆలోచిస్తున్నారని అన్నారు. జైల్లో ఆయన ఎంతో మనోధైర్యంగా వున్నారని... వైసిపి అక్రమాలపై పోరాటం ఆపకూడదని సూచించినట్లు నారాయణ తెలిపారు. 

తన అక్రమ అరెస్ట్ ను ఖండించిన వివిధ పార్టీలు, మద్దతుగా నిలిచిన ప్రజలు, నిరసనలకు దిగిన టిడిపి శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా చంద్రబాబు సూచించినట్లు నారాయణ తెలపారు. అధికార వైసిపి దౌర్జన్యాలకు భయపడకూడదని... అక్రమాలు, అవినీతిని ప్రశ్నించాలని చంద్రబాబు చెప్పినట్లు నారాయణ వెల్లడించారు. 

చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళుతుండటం... ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి సహించలేకే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసారని నారాయణ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్చందంగా నిరసనలు చేపడుతున్నారని... రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. ఇలా చంద్రబాబుకు అండగా నిలుస్తున్నవారిని కూడా వైసిపి నాయకులు పోలీసులతో బెదిరిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

Read More  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్‌కు స్వల్ప ఊరట: అక్టోబర్ 4వరకు అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు
 
చంద్రబాబు అరెస్ట్ తో టిడిపిని దెబ్బతీయాలని వైసిపి అనుకుందని... కానీ  పార్టీకి మరింత బలం పెరిగిందన్నారు. ఇప్పుడు లోకేష్ ను కూడా అరెస్ట్ చేయాలని చూస్తుండగా హైకోర్టు కేవలం 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని సూచించిందని అన్నారు. ఇది తమ మొదటి విజయమని నారాయణ అన్నారు. 

ఆరునెలల్లో ఎన్నికలు వుండగా చంద్రబాబును అరెస్ట్ చేసి ప్రజల్లోకి వెళ్లకుండా చేసారని నారాయణ అన్నారు. అయినా ప్రజలకు చంద్రబాబు ఎలాంటి నాయకుడో తెలుసు... అలాంటి నాయకున్ని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టడం అందరూ చూస్తున్నారని అన్నారు. కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా వున్నారని నారాయణ అన్నారు.

ఇక ఇన్నర్ రింగ్ రోడ్డులో తనపై వైసిపి చేస్తున్న ఆరోపణలపై నారాయణ స్పందించారు. ఈ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ప్లానింగ్ లో తనదే ఏడుకోట్ల విలువైన భూమి పోయిందని... బంధువుల భూములు కూడా పోయాయని నారాయణ తెలిపారు. నిజంగానే రింగ్ రోడ్డు విషయంలో తాను అవినీతికి పాల్పడివుంటే ముందు తన భూమిని కాపాడుకునేవాడిని కదా అని నారాయణ అన్నారు. ఎక్కడా ఎలాంటి అవినీతి జరగలేదు... కావాలనే తమపై  అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios