ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్‌కు స్వల్ప ఊరట: అక్టోబర్ 4వరకు అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు


ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ కు వచ్చే నెల 4వ తేదీ వరకు ఏపీ హైకోర్టు  ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
 

AP High Court Grants Anticipatory bail to Nara Lokesh in AP Skill development Case lns

అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను  ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వచ్చే నెల 4వ తేదీ వరకు  లోకేష్ ను అరెస్ట్ చేయవద్దని  హైకోర్టు ఆదేశించింది. మరో వైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ నారా లోకేష్ తరపు న్యాయవాదులు శుక్రవారంనాడు ఏపీ  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం విచారణ జరిగింది. 

ఈ పిటిషన్లపై  విచారణ ప్రారంభం కాగానే మధ్యంతర బెయిల్ కావాలని లోకేష్ తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు.అయితే ఈ సమయంలో అడ్వకేట్ జనరల్ శ్రీరాం జోక్యం చేసుకున్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్లమన్నారు. ఈ కేసులో చంద్రబాబు ఏ1 నిందితుడని  ఏజీ శ్రీరాం హైకోర్టులో వాదించారు.ఈ స్కాంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్దిపొందారని ఏజీ ఆరోపించారు.ఈ విషయమై కోర్టులో ఆధారాలు అందించామన్నారు. 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ పై సీఐడీ అభియోగాలు మోపిందని  తెలిసిన వెంటనే  ఆయన తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.  రిమాండ్ రిపోర్టులో  లోకేష్ పాత్రపై సీఐడీ అభియోగాలు మోపింది.  ఏపీ ఫైబర్ నెట్ కేసులో  ముందస్తు బెయిల్  పిటిషన్ ను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. 

also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్, ఏపీ ఫైబర్ నెట్ కేసులు: ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు, నేడు విచారణ

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు వచ్చే నెల 4వ తేదీ వరకు లోకేష్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల  4వ తేదీన పూర్తిస్థాయిలో వాదనలు వింటామని ఏపీ హైకోర్టు తెలిపింది.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ  నెల 9వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు  జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios