ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో వుంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కంటేవారిపల్లి నుంచి ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో వుంది. ఈ నేపథ్యంలో లోకేష్ తన యాత్రకు విరామం ప్రకటించారు. మదనపల్లి నియోజకవర్గంలోని కంటేవారిపల్లి బస ప్రాంతం నుంచి ఆయన వెళ్లిపోయినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. పోలీసుల విజ్ఞప్తి మేరకు నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కంటేవారిపల్లి నుంచి ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. 

కాగా.. ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. 2 ఉపాధ్యాయ, 3 పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

ALso REad: టీచర్ , గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బోగస్ ఓట్లపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఇదిలావుండగా.. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఈ నెల 12న తంబళ్లపల్లెలో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ప్లేస్, టైమ్ చెప్పాలని మిథున్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా డీఎన్ఏ నీ బ్లడ్‌లో వుంటే తనతో పోటీ చేయాలంటూ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదని.. ఎవరో రాసిచ్చింది చదవకూడదన్నారు. 

ఇకపోతే.. తన యువగళం పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో వున్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాను గుప్పిట్లో పెట్టుకుని .. దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మదనపల్లెకి ఏం చేశావంటూ మిథన్ రెడ్డిని ప్రశ్నించారు. తాను తంబళ్లపల్లెలోనే వుంటానని.. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని లోకేష్ సవాల్ విసిరారు. మీలాగా తాము తప్పు చేయమని.. అభివృద్ధి మాత్రమే చేస్తామని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇద్దరు యువ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో చిత్తూరు జిల్లా రాజకీయం వేడెక్కింది.