గుంటూరు: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో పోటీచేసి గెలిచినవారిని మగాడు, మొనగాడు అంటారని... అన్నీ ఏకగ్రీవాలు చేసుకొని దొడ్డిదారిన గెలిచినవాడిని జగన్ రెడ్డి అంటారని టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు వెళ్లేముందు ఏపార్టీ అయినా ఒక మేనిఫెస్టో విడుదల చేసి  ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు, సంక్షేమం అమలుచేయబోతోందో చెబుతుందన్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం మమ్మల్ని ఓడిస్తే, పింఛన్లు పీకేస్తాం. రేషన్ కార్డులు తీసేస్తామని బెదిరించే స్థితికిచేరారని మండిపడ్డారు. 

శుక్రవారం మంగళగిరిలోని టిడిపి జాతీయ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి లోకేష్ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళితే, నామినేషన్ పత్రాలు చించేశారని గుర్తుచేశారు. వార్డు మెంబర్లుగా పోటీచేసిన  అభ్యర్థులను బెదిరించారు...అయినా లొంగకపోతే సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేస్తామన్నారు... అప్పటికీ లొంగనివారిపై పోలీస్ యంత్రాంగం సాయంతో దొంగకేసులుపెట్టి  జైళ్లకు పంపారని తెలిపారు. 

''తెలుగుదేశం నాయకులపై ఎటువంటి కేసులుపెట్టారో చూశాం. అచ్చెన్నాయుడే అందుకు ఉదాహరణ. ఆయన సొంతఊరిలో పోటీలో నిలిచిన అభ్యర్థిని బతిమాలుతూ మనకెందుకురా నఊరిలో గొడవలు అని చెప్పినందుకు కేసులుపెట్టి జైలుకుపంపారు. అదే వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఏ1,ఏ2లు సహా ప్రతిఒక్కరూ ప్రత్యక్షంగా దాడిచేస్తూ, బెదిరింపులకు దిగుతున్నావారిపై ఎటువంటి చర్యలు ఉండవు. వారిపై తూతూమంత్రంగా కేసులు నమోదుచేసి,  స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు పంపుతారు.  ఇన్నిఇబ్బందులున్నాకూడా మొన్నముగిసిన పంచాయతీ ఎన్నికల్లో 38.89శాతం పంచాయతీలను టీడీపీ కైవసం చేసుకుంది'' అని తెలిపారు. 

read more  ఆరు నెలలకోసారి ఉద్యోగ మేళా: టీడీపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన లోకేష్

''జగన్ రెడ్డి పాలన చూస్తే పబ్లిసిటీ పీక్ –మేటర్  వీక్ అని తెలుస్తోంది. అందుకు సన్న బియ్యం పంపిణీయే ఉదాహరణ. ఎన్నికలకు ముందు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. ఎన్నికల తరువాత సన్నబియ్యం కాదు, నాణ్యమైన బియ్యం ఇస్తామన్నారు. అందుకోసం వేలాదికోట్లు ఖర్చుచేసి వాహనాలు(ఆటోలు)కొనుగోలు చేశారు. బెంజిసర్కిల్ దగ్గర బండ్ల ప్రదర్శన ఏర్పాటుచేసి, ఫోటోలు తీసుకొని, ఫోజులిచ్చి, వాటిని ఊళ్లకు పంపారు. అవి ఎంతస్పీడుగా గ్రామాలకు వెళ్లాయో, అంతేస్పీడుగా ప్రజలతో ఛీకొట్టించుకొని తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయి. అందుకే అంటున్నాము పబ్లిసిటీ పీక్ –మేటర్  వీక్ అని'' విమర్శించారు. 

''ఒక్కఛాన్స్.. ఒక్కఛాన్స్ అని ప్రజలను అడిగి ముఖ్యమంత్రయ్యాక జగన్ రెడ్డి ఏం పీకారని అడుగుతున్నాను. పట్టణ ప్రాంతాల్లో చూస్తే ఎలాంటి అభివృద్ధి జరిగిన పరిస్థితి లేదు. కనీసం రోడ్లపై ఉన్నగుంతలుకూడా పూడ్చే పరిస్థితిలో, ఒక మీటర్ డ్రైనేజ్ కట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఎక్కడా ఒక్కపార్క్ గానీ, ఇల్లు గానీ కట్టేస్థితిలో ప్రభుత్వం లేదు. అంతెందుకు కాలిపోయిన ఎల్ఈడీ వీధిదీపాలనుకూడా మార్చలేదు. 21నెలల్లో ఈ ప్రభుత్వం పీకింది అది'' అని మండిపడ్డారు. 

''మరోపక్కన లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉంది.  ప్రజలంతా అనుకున్నారు..ఆయనొస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంటుందని. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైంది అది బుల్లెట్ లేని గన్ అని. చూడండి మహిళలపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నరసరాపుపేటలో అనూష అనే యువతి దారుణంగా చంపబడింది. దిశాచట్టం తీసుకొచ్చి ఏం పీకారు?'' అంటూ నిలదీశారు.