ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. ముగిసిన నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజూ సీఐడి విచారణ ముగిసింది . హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలు, జీవోఎం నిర్ణయం, లోకేష్ పాత్రపై అధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజూ సీఐడి విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ఆయను సీఐడీ అధికారులు విచారించారు. హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలు, జీవోఎం నిర్ణయం, లోకేష్ పాత్రపై అధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళవారం 41 ఏ ఇచ్చి బుధవారం మళ్లీ విచారణకు రావాలని కోరారని తెలిపారు. సీఐడీ అధికారుల నోటీసు మేరకు విచారణకు వచ్చినట్లు లోకేష్ వెల్లడించారు.
తాను అడిగిన ప్రశ్నలకు సీఐడీ అధికారులు సమాధానం చెప్పలేదని.. తన శాఖకు సంబంధించి పదే పదే ప్రశ్నించారని ఆయన తెలిపారు. ఐటీ రిటర్న్‌లకు సంబంధించి సమాధానం దాటవేశారని.. ఐఆర్ఆర్‌కు సంబంధించి నాలుగైదు ప్రశ్నలు అడిగారని లోకేష్ వెల్లడించారు. హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన 9 ఎకరాలను గూగుల్ ఎర్త్‌లో చూపించారని.. ఐఆర్ఆర్ వల్ల తమ కంపెనీ భూములు కోల్పోయినట్లు చెప్పారని ఆయన తెలిపారు.
ఐఆర్ఆర్‌లో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి పాత్ర లేదని.. గత పదేళ్లుగా తమ కుటుంబ ఆస్తులను ప్రజలకు తెలియజేస్తున్నామని లోకేష్ చెప్పారు. గజం ఎక్కువున్నట్లు నిరూపించినా తమ ఆస్తులు రాసిస్తానని ఆయన వెల్లడించారు. రెండు రోజుల పాటు తన సమయం వృథా చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.