మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అధ్యక్షతన మాలల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.
మంగళగిరి : ఉన్నత చదువులు చదివి ఐఎఎస్, ఐపిఎస్ లుగా మారిన దళిత బిడ్డలు వైసిపి పాలనలో 'అయ్యా ఎస్' అంటూ సమిదలు కావద్దని మాజీ మంత్రి, టిడిపి నేత నక్కా ఆనంద్ బాబు హెచ్చరించారు. దళిత సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ను వాడుకుని వదిలేసిన సీఎం మరో దళితున్ని అదే స్థానంలో నియమించి పబ్బం గడుపుకుంటున్నాడని అన్నారు. దళిత అధికారుల భుజాలపై తుపాకీ పెట్టి రాజకీయ ప్రత్యర్ధులను అణచివేసే ప్రయత్నం జగన్ చేస్తున్నాడని... రానున్న రోజుల్లో ఇది అధికారులను ఇబ్బంది పెట్టవచ్చంటూ మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నక్కా ఆనంద్ బాబు అధ్యక్షతన మాలల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి దళితులకు మరీ ముఖ్యంగా మాలలకు వైసిపి పాలనలో ఎలా అన్యాయం జరుగుతుందో వివరించారు. వైసిపి ప్రభుత్వంపై ఇప్పటికే మాలల్లో వ్యతిరేకత వుందని... కాబట్టి టిడిపి అధికారంలోకి తీసుకురావడానికి వారు సమిదలుగా మారడానికైనా సిద్దంగా ఉన్నారని ఆనంద్ బాబు అన్నారు.
రాష్ట్రంలో దళిత ఓటర్లు దాదాపు 80లక్షల మంది వున్నారని... చాలా నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో వీరు వున్నారని ఆనంద్ బాబు తెలిపారు. దీంతో గత ఎన్నికల సమయంలో దళితులకు మాయమాటలు చెప్పి ఓట్లువేయించుకుని జగన్ గెలిచారని.... అధికారం చేపట్టిన తర్వాత అన్ని కులాల మాదిరిగానే దళితులను దగా చేసాడని ఆరోపించారు. దళితుల్లో 58 శాతం మాలలేనని... వారిని కూడా జగన్ వంచించాడని ఆనంద్ బాబు అన్నారు,
Read More టిడిపి పగ్గాలు జూ.ఎన్టీఆర్ కు... లేదంటే ఆ నందమూరి హీరోకే..: లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు మొదటి దళిత సీఎస్ ను నియమించిన ఘనత టిడిపి దే అని మాజీ మంత్రి అన్నారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గానే కాదు లోక్ సభ స్పీకర్ గా మాల కులానికి చెందిన నాయకులను నియమించి గౌరవించిన ఘనత టిడిపిదని అన్నారు. అలాగే ముఖ్యమంత్రిగా 14 శాతం ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతంకు పెంచిన ఘనత, అంబేడ్కర్ కు భారతరత్న ఇవ్వాలని నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా పట్టుబట్టింది ఎన్టీఆర్ అని అన్నారు. జస్టిస్ పున్నయ్య కమీషన్ ఏర్పాటుచేసి 42 సిఫారసుల అమలుకు 18 జీవోలు తీసుకొచ్చి అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదని ఆనంద్ బాబు అన్నారు.
ఒక్క ఛాన్స్ పేరుతో ఓట్లు వేయించుకున్న జగన్ రెడ్డి దళితులను దగా చేశాడు...కాబట్టి ఆయనకు మాలల సత్తా చూపించాలని ఆనంద్ బాబు సూచించారు. ఆనాడు బ్రహ్మనాయుడికి మాల కన్నమదాసు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నట్లు నేటి మాలలు చంద్రబాబుకు అండగా నిలబడాలన్నారు. టిడిపిని అధికారంలోకి తీసుకురావాల్సిన భాద్యత... తిరిగి చంద్రబాబును గౌరవ సభకు హుందాగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మాలలదే అని అన్నారు. జనాభా దామాషా ప్రకారం పార్టీలో, ప్రభుత్వంలో మాలలకు న్యాయం జరుగుతుందని ఆనంద్ బాబు అన్నారు.
