నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కు లేదంటే కళ్యాణ్ రామ్ కు వారి తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేసారు.
అమరావతి : ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలని నందమూరి అభిమానులు, కొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. పలుమార్లు టిడిపి చీఫ్ చంద్రబాబు కార్యక్రమాల్లోనే జూ.ఎన్టీఆర్ ఫోటోలు, ప్లకార్డులతో కొందరు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తన వారసుడు లోకేష్ కు టిడిపి బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమైన చంద్రబాబుకు ఇదో తలనొప్పిగా మారింది. ఇదే అదునుగా చంద్రబాబును మరింత ఇబ్బందిపెట్టి లోకేష్ ను అసమర్దుడిగా ప్రచారం చేసేందుకు జూ.ఎన్టీఆర్ ను వాడుకుంటోంది వైసిపి. ఇప్పటికే కొడాలినాని, వల్లభనేని వంశీ వంటివారు టిడిపి బ్రతికిబట్టకట్టాలంటే జూ.ఎన్టీఆర్ కు పగ్గాలు అప్పగించాలని అంటుంటే తాజాగా వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి కూడా అదే అభిప్రాయం వ్యక్తంచేసారు.
టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా లోకేష్ ను ప్రజలు స్వీకరించడం లేదని... కేవలం నారా చంద్రబాబు కొడుకుగానే చూస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. కాబట్టి టిడిపిని తిరిగి నందమూరి కుటుంబానికి అప్పగించాలని కోరారు. ఎన్టీఆర్ మనవళ్లు జూ.ఎన్టీఆర్ లేదా కళ్యాణ్ రామ్ కు టిడిపి పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేసారు. నందమూరి అభిమానులు లోకేష్ ను రాజకీయాల నుండి తరిమికొట్టాలని లక్ష్మీపార్వతి అన్నారు.
ఇక పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్ ప్రసంగాలపైనా లక్ష్మీపార్వతి ఘాటుగా స్పందించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రతిపక్షాలకు ప్రజలు గుర్తొచ్చినట్లున్నారంటూ ఎద్దేవా చేసారు. చంద్రబాబు తన సొంతపుత్రుడితో పాటు దత్తపుత్రుడు ఇద్దరినీ ప్రజలపైకి వదిలాడని... వారేమో చంపేస్తాం, నరికేస్తాం, బట్టలిప్పి కొడతాం అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా ఎంత తిరిగినా ప్రజలు నమ్మరని అన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అమాయకుడని... తన రాజకీయాల కోసమే చంద్రబాబు ఆయన్ని వాడుకుంటున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. సినిమాలు చేసుకునే పవన్ ను రాజకీయాల్లోకి తెచ్చి ఆయన సామాజికవర్గానికే చెందిన కాపు నాయకులను తిట్టిస్తున్నాడని అన్నారు. చంద్రబాబు విషవృక్షం లాంటివాడని... ఆయన నీడన రాజకీయాల చేయొద్దని గతంలనే పవన్ కు చెప్పానని లక్ష్మీపార్వతి అన్నారు. పవన్ పై తనకు సానుభూతి ఉందికాబట్టే ఆయనను చంద్రబాబు రాజకీయాలకు బలికావద్దని హితవు చెప్పానని లక్ష్మీపార్వతి తెలిపారు.
