కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగవిప్పింది.. దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో తెలుగుదేశం పార్టీ నేత, మండలాధ్యక్షుడు సోమేశ్వర్ గౌడ్‌ను అత్యంత దారుణంగా నరికి చంపారు. ఇతనికి పల్లెదొడ్డిలో ఓ మద్యం షాపు ఉంది...

రాత్రి షాపు మూసేసిన తర్వాత కుమారుడితో కలిసి వస్తుండగా మార్గమధ్యంలో మాటు వేసిన ప్రత్యర్థులు  సోమేశ్వర్‌ కళ్లలో కారం చల్లి హత్య చేసేందుకు ప్రయత్నించారు. వారి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వేటకొడవళ్లతో వెంటాడీ మరీ నరికి చంపారు.

దీంతో సోమేశ్వర్ గౌడ్ అక్కడికక్కడే మరణించగా... ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు.