శ్రీకాకుళం: దమ్ముంటే మూడు రాజధానుల అంశంపై వైసిపి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి గెలవాలని టిడిపి నాయకులు కూన రవికుమార్ సవాల్ విసిరారు. మంత్రి సిదిరి అప్పలరాజు బెదిరింపులకు భయపడేది లేదని పేర్కొన్నారు.  ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశమని...వైసిపి మాదిరిగా పదవి కోసం పుట్టిన పార్టీ కాదని రవికుమార్‌ ఎద్దేవా చేశారు. 

అధికార, ప్రతిపక్ష పాత్రలు పోషించే సమర్థత ఉన్న పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు. మూడు రాజధానుల విషయంలో దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని... ఒకవేళ ఓడిపోతే అమరావతి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

read more   బెదిరించి భూములు లాక్కుంటున్న బెంజ్ కారు మంత్రి : అయ్యన్న

సోమవారం మంత్రి సిదిరి అప్పలరాజు టిడిపి నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూన రవికుమార్ కు  కొవ్వెక్కిందని...వాడెవడో బుద్దా వెంకన్న అట... ఏదో వాగుతున్నాడు ఆయన అన్నారు. వీరు మరీ బరి తెగించి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. వీరి కొవ్వు తీసే సమయం ఆసన్నమైందని మంత్రి హెచ్చరించారు. 

అమరావతి రైతులపైనా మంత్రి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమానంలో ఢిల్లీ వెళ్లినవారు అమరావతి రైతులా? అని ఆయన ప్రశ్నించారు. ముమ్మాటికీ వారు పెయిడ్ అర్టిస్టులేనని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

విశాఖ రాజధాని కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని... టీడీపీ నేతలు తనపై పోటీ చేసి గెలవగలరా? అని ఆయన ప్రశ్నించారు. మంచికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. కృష్ణదాస్ తన నియోజకవర్గంలో తన మనుషులతో మాట్లాడిన విషయాలను ఎల్లో మీడియా వక్రీకరించి బూతులు మాట్లాడినట్లు చిత్రీకరించిందని ఆయన విమర్శించారు. 

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు టెక్కలి నియోజకవర్గంలో ఓ మహిళతో "మా ప్రభుత్వం ఇచ్చిన పది వేలు తీసుకుని ఓటెయ్యవా అని, అది నీ మొగుడి సొమ్మా" అని అసభ్యకరమైన పదజాలం ప్రయోగించిన విషయం అందరికీ గుర్తుందని మంత్రి అన్నారు. అదే పార్టీకి చెందిన రవి కుమార్ ఫోన్ సంభాషణలు అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

ఎవరైతే బాగా బూతులు మాట్లాడగలరో, వీధి రౌడీల్లో వ్యవహరించగలరో వారినే చంద్రబాబు గుర్తించి అధ్యక్ష పదవులు కట్టబెడుతున్నారంటే ఆ పార్టీ తీరు అందరికీ అర్థమవుతోందని ఆయన అన్నారు కృష్ణదాస్ రాజకీయ చరిత్రలో ఎక్కడా వివాదం లేదని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు 

అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. కరోనా కాలంలో కనిపించని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్టేషన్ వద్దకు దౌర్జన్యం చేయడానికి రావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసు స్టేషన్ వద్ద క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం రౌడీయిజానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా మంత్రి చేసిన కామెంట్స్ కి తాజాగా రవికుమార్ కౌంటరిచ్చారు.