అమరావతి: సంవత్సరంన్నర కాలంగా దేవాలయాలపై, హిందూ మతంపై జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. దేవాలయాలకు రక్షణ కల్పించలేని అసమర్థ వ్యక్తిగా, తనకి తాను చేతగాని, దద్దమ్మ ముఖ్యమంత్రినని ఆయన మాటలతోనే తేలిపోయిందని మండిపడ్డారు.

''దేవాలయాలపై జరుగుతున్న దాడులపై టీడీపీ దగ్గర 136 ఆధారాలున్నాయి. పాకిస్థాన్ లో హిందూ దేవాలయంపై దాడి జరిగితే 24గంటల్లోనే దాడికి కారకులైన 45 మందిని అరెస్ట్ చేశారు. ఏపీలో 136సంఘటనలు జరిగితే , జగన్మోహన్ రెడ్డి ఒక్కరినైనా అరెస్ట్ చేయించగలిగాడా? పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించినంత మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి ఏపీలో జరిగిన ఘటనలపై స్పందించలేదు'' అన్నారు. 

''నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనం టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముకున్న పనికిమాలిన దేవాదాయమంత్రి వెల్లంపల్లి మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి రాజుగురించి మాట్లాడతాడా? చిట్ ఫండ్  వ్యాపారం చేసే వెల్లంపల్లి బినామీ ఒకతను రూ.50లక్షల చిట్ వేస్తే స్వామివారి వస్త్రాలు బహుమతిగా ఇస్తామని, రూ.20లక్షల చిట్ వేస్తే అభిషేకం టికెట్లు, రూ.10లక్షల చిట్ కు తోమాలసేవ టిక్కెట్లను ఇస్తానని బహిరంగంగానే చెబుతున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టిక్కెట్లను చిట్ ఫండ్ వ్యాపారం కోసం దుర్వినియోగం చేస్తున్న పనికిమాలిన వ్యక్తి వెల్లంపల్లి'' అని ఆరోపించారు.

''విజయసాయి రెడ్డి భయపడాల్సింది చంద్రబాబు నాయుడిని, అచ్చెన్నాయుడిని చూసికాదు, జగన్మోహన్ రెడ్డిని చూసి. జగన్ గుట్టంతా, ఆయన అవినీతి చిట్టా అంతా విజయసాయి దగ్గరేఉంది. సొంత చిన్నాన్ననే దారుణంగా బాత్రూమ్ లో చంపించిన వ్యక్తి దెబ్బకు భయపడిన విజయసాయి, బాత్రూమ్ కు వెళ్లడానికి భయపడి, కాల్వగట్లపై తిరుగుతున్నాడని విశాఖ వాసులు చెప్పుకుంటున్నారు'' అని ఎద్దేవా చేశారు.

read more  అశోక్‌ గజపతిపై వెల్లంపల్లి వ్యాఖ్యలు.. రంగంలోకి క్షత్రియ సంఘం

''ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడి 24 గంటలు కూడా గడవకముందే ప్రకాశం జిల్లాలోని శింగరాయకొండ లక్షీనరసింహస్వామి దేవాలయ ప్రాకారంపై దాడి జరిగింది. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా నేడు ప్రకాశం జిల్లాలో ఆయన పర్యటన ఏదీ లేదుకదా?'' అని ప్రశ్నించారు.

''దేవాలయాలపై దాడులకు సంబంధించి వైసీపీ నేతలు ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పడానికి అనేక ఆధారాలున్నాయి. కర్నూలు జిల్లాలోని గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయస్వామి దేవాలయాన్ని  వైసీపీనేత దామోదర్ రెడ్డి జేసీబీలతో కూల్చేశాడు. సీ.సీ.కెమెరా ఫుటేజీలో ఆయన పట్టుబడ్డాడు. కర్నూలు జిల్లాలోని ఓంకారక్షేత్రంలో పెండెం ప్రతాపరెడ్డి అనే వైసీపీనేత నిర్దాక్షణ్యంగా అర్చకులపై దాడిచేసి చితకబాదిన దృశ్యాలున్నాయి. బూతులమంత్రి కొడాలినాని విగ్రహం అంటే రాయే కదా... చేయి విరిగితే పోయేదేముందని చంద్రబాబు చెబితే అన్నాడా? ఇళ్లస్థలాలకు దేవాదాయ భూములు తీసుకోవచ్చని జీవో ఇచ్చింది జగన్ ప్రభుత్వం కాదా?'' అంటూ నిలదీశారు.

''ఊరికొక ప్యాలెస్ నిర్మించుకున్న జగన్మోహన్  రెడ్డి అమరావతిలో వేంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశాడు?  నిజంగానే జగన్ చెప్పినట్లుగా ఆయన ప్రభుత్వానికి క్లైమాక్స్ దగ్గరపడింది. దిక్కుమాలిన పనులుచేస్తున్న మంత్రులను వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి సిగ్గులేకుండా చంద్రబాబుపై విమర్శలు చేస్తాడా? చేతనైతే కొడాలినానీపై, వెల్లంపల్లిపై జగన్ చర్యలు తీసుకోవాలి. జగన్ కు ధైర్యముంటే ఆయనకు నమ్మకమున్న దేవుడిపై ప్రమాణం చేసి, దేవాలయాలపై దాడులకు టీడీపీనే కారణమని చెప్పగలరా?'' అని పట్టాభిరాం సవాల్ విసిరారు.

''దేవాలయాలపై దాడులకు పాల్పడుతూ ప్రత్యక్షంగా దొరికిన వైసీపీ నేతలు, అడ్డగోలుగా మాట్లాడిన మంత్రులపై చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి, నంగనాచి కబుర్లు చెబుతూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడు. రామతీర్థంలో ఏ2 ని చెప్పులతో , రాళ్లతో కొట్టినట్టే, జగన్మోహన్ రెడ్డికి కూడా బుధ్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు'' అని పట్టాభిరామ్ హెచ్చరించారు.