Asianet News TeluguAsianet News Telugu

ఎస్పీ ఎదుటే ఆ వైసిపి నేత హత్యకు కుట్ర జరిగిందా?: టీడీపీ అధికార ప్రతినిధి

 బీసీ వర్గాల్లో కీలకమైన వ్యక్తి, మాజీ మంత్రి అయిన కొల్లు రవీంద్రను రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం అరెస్ట్ చేసిందని... అందుకు పోలీస్ శాఖ తయారుచేసిన రిమాండ్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ లే సాక్ష్యాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు.

TDP Leader Kommareddy Pattabhiram comments on machilipatnam ycp  leader murder case
Author
Guntur, First Published Jul 10, 2020, 7:29 PM IST

గుంటూరు:  బీసీ వర్గాల్లో కీలకమైన వ్యక్తి, మాజీ మంత్రి అయిన కొల్లు రవీంద్రను రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం అరెస్ట్ చేసిందని... అందుకు పోలీస్ శాఖ తయారుచేసిన రిమాండ్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ లే సాక్ష్యాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేకే ఆపార్టీకి చెందిన సీనియర్ నాయకులను, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల నాయకులను జగన్ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందన్నారు. ఏడాదిపాలనలో జగన్ చేసిన అవినీతి, సంక్షేమం ముసుగులో వారు చేస్తున్న కుంభకోణాలు, ఇచ్చినహామీలు అమలుచేయకపోవడం వంటి చర్యలతో ప్రజల్లో నానాటికీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందన్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు ప్రజలపక్షాన చేస్తున్న ఉద్యమాలకు తట్టుకోలేకనే ప్రభుత్వం, ప్రతిపక్షంపై కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. ముఖ్యంగా బీసీ నాయకులనే తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందన్నారు. 

కొల్లు రవీంద్రపై పెట్టిన కేసుల వివరాలు, పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ పరిశీలిస్తే ఖాకీలు అధికారపార్టీకి ఎలా తొత్తులుగా మారారో అందరికీ అర్థమవుతుందన్నారు. జూన్ 29న మచిలీపట్నంలో హత్యకు గురైన మోకా భాస్కరరావు 2 రేప్ కేసులు, 6 మర్డర్ కేసులు, 18 దొంగతనం కేసులు, 38 సివిల్ కేసులు, 24 ఇతర చిల్లర కేసుల్లో ముద్దాయని... అతనిపై మొత్తం దాదాపు 90 కేసులున్నాయని పట్టాభి వివరించారు. అటువంటి వ్యక్తి చేతిలో బాధింపబడినవారితో అతనికి శత్రుత్వం ఉండటం సహజమని, అలా బాధింపబడిన చింతా సోదరులే అతన్ని హత్య చేయడం జరిగిందన్నారు. 

భాస్కరరావు స్వాతంత్ర్య సమరయోధుడో, గొప్పవ్యక్తో అయినట్లు వైసీపీనేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మోకా భాస్కరరావు, చింతా సురేంద్రఅనే వ్యక్తిని జనవరి1, 2013న అతి కిరాతకంగా హత్య చేయించారని, అప్పటినుంచి చింతా కుటుంబానికి, భాస్కరరావుకి మధ్య అనేక ఘర్షణలు జరిగాయన్నారు. ఈనేపథ్యంలో భాస్కరరావు పై కక్ష పెంచుకున్న చింతా సురేంద్ర సోదరులు చింతా చిన్ని, చింతా నాంచారయ్య, చింతా కిశోర్ లు జూన్29న భాస్కరరావుని హత్యచేయడం  జరిగిందన్నారు. ఈ హత్యకేసులో కొల్లు రవీంద్రను ఇరికించడానికి పోలీసులే ముద్దాయిలపై ఒత్తిడి తీసుకొచ్చారని పట్టాభి స్పష్టంచేశారు. 

జూన్ 29న ఉదయం 11.30నిమిషాలకు హత్య జరిగితే మధ్యాహ్నం 1.15 నిమిషాలకు పోలీసులు ఎఫ్ఐఆర్ తయారుచేసి దానిలో ఏ4గా కొల్లు రవీంద్ర పేరు చేర్చారన్నారు. ఏ1, ఏ2, ఏ3లుగా చింతా చిన్ని, చింతా నాంచారయ్య, చింతా కిశోర్ లు ఉన్నారన్నారు. మోకా భాస్కరరావు బంధువులు ఫిర్యాదు చేసిన వెంటనే, ఏవిధమైన కనీస విచారణ జరపకుండా పోలీసులు మాజీ మంత్రి పేరును ఎలా చేర్చారో చెప్పాలన్నారు. రేపు ఎవరో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేస్తే  ఇదేవిధంగా విచారణ జరపకుండా ఆయన పేరు చేరుస్తారా? అని పట్టాభి కృష్ణాజిల్లా ఎస్పీని నిలదీశాడు. మరీ ఇంతదుర్మార్గంగా వ్యవహరిస్తున్న పోలీసులను ఇక్కడే చూస్తున్నామన్నారు. 

read more   పథకాల్లో అర్హులకు అన్యాయం జరగొద్దు: వైఎస్ జగన్

జూన్ 29న మద్యాహ్నం హత్యజరిగిన సమయానికే, కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల కార్యాలయాలకు వెళ్లారన్నారు. పోలీసులు మాత్రం రిమాండ్ రిపోర్ట్ లో రిజ్వాన్ అనే వ్యక్తి కొల్లు రవీంద్రకు ఫోన్ చేస్తే ఆయన ముద్దాయిలకు సూచనలు చేసినట్లు చెప్పడం ఎంతటి దారుణమో ఆలోచించాలన్నారు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో ఇంతదారుణంగా అబద్ధాలు రాయడమేంటన్నారు. రవీంద్ర ఎస్పీ ఎదుటే ఉండి హత్య చేసినవారితో ఎలా మాట్లాడారో జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. (కొల్లు రవీంద్ర ఎస్పీని కలిసి వినతిపత్రం ఇస్తున్న ఛాయాచిత్రాన్ని ఈ సందర్భంగా పట్టాభి విలేకరులకు చూపించారు). తన సమక్షంలో ఉన్న వ్యక్తి ముద్దాయిలతో ఎలా మాట్లాడారో ఎస్పీనే చెప్పాలన్నారు? పట్టాభిరాం. 

తప్పుడుకేసులతో, తప్పుడు ఆధారాలతో మాజీ మంత్రిని ఎలా ఇరికించారో ప్రజలకు తెలియాలన్నారు.  హత్యచేసిన నిందితులు పారిపోతూ కొల్లు రవీంద్రకు ఫోన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారని, ఇదంతా పదినిమిషాల్లోనే ఎలా సాధ్యమైందో చెప్పాలన్నారు. ఈవిధంగా అధికారపార్టీకి లొంగిపోయి, తప్పుడు రాతలు రాయడానికి పోలీస్ శాఖ సిగ్గుపడాలని పట్టాభి ఆగ్రహం వ్యక్తంచేశారు. జూన్ 29సాయంత్రం 6.30-7.00 గంటల మధ్యలో ముద్దాయిలు పెడన పోలీస్ స్టేషన్ లో లొంగిపోతే వారిని గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారని... ఇదే అంశం సాక్షి ఛానల్ లో ప్రసారమైందన్నారు. జూన్ 29, 30నాటి పెడన, గూడూరు పోలీస్ స్టేషన్ల సీసీ. టీవీ పుటేజ్ ను ప్రజల ముందుంచే ధైర్యం ఎస్పీకి ఉందా? అని పట్టాభి నిలదీశారు. 

ముద్దాయిలు ఆ రెండురోజులు పోలీస్ స్టేషన్లలో ఉన్నట్లు వైసీపీ సోషల్ మీడియాలో కూడా వచ్చిందన్నారు. జూన్ 30నాటి సాక్షిపత్రికలో హత్య జరిగిన ఏడుగంటలు తిరగకుండానే పట్టుకున్నట్లు వార్త కూడా వచ్చిందన్నారు. జూలై 3న పోలీస్ శాఖ వారు ఇచ్చిన పత్రికా ప్రకటనలో మాత్రం హత్యచేసిన వ్యక్తులు పారిపోతుంటే పట్టుకున్నట్లు రాయడమేంటన్నారు. నిందితులు వారికి వారే లొంగిపోతే పోలీసులు అందుకు విరుద్ధంగా తప్పుడు వార్తలు ఎలా రాస్తారో  చెప్పాలన్నారు? గూడూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న నిందితుల ఫొటోలు బయటకు వచ్చాయన్న కారణంతో ఇద్దరు కానిస్టేభుళ్లను వీఆర్ కు కూడా పంపారన్నారు. కొల్లు రవీంద్రను ఇరికించడానికే పోలీసులు నిందితులను చిత్రహింసలకు గురిచేసి వారితో మీకు కావాల్సినట్లుగా చెప్పించుకొని అప్పుడు అరెస్ట్ లు చూపిస్తారా? అని పట్టాభి దుయ్యబట్టారు. 

ధర్మం నాలుగు పాదాలతో డీజీపీ కార్యాలయం నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు నడుస్తోందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండబోదన్నారు. కొల్లు రవీంద్ర హత్యారాజకీయాలను ప్రోత్సహించరు కాబట్టే మచిలీపట్నం టీడీపీ పాలనలో ప్రశాంతంగా ఉందన్నారు. నిజంగా ఆయన మోకా భాస్కరరావుపై కక్ష తీర్చుకోవాలని భావిస్తే మంత్రిగా ఉన్నప్పుడే ఆ పనిచేసి ఉండేవారన్నారు. భాస్కరరావు ఎలాంటివాడో తెలిసికూడా మంత్రి పేర్నినాని ఆయనపై ప్రేమ ఒలకబోయడం సిగ్గుచేటన్నారు. పోలీసులను గోడలు దూకించే సంస్కృతి వైసీపీదని, కొల్లు రవీంద్ర దర్జాగా తన కారులో జూలై3న కాకినాడ వెళ్లాడన్నారు. దాన్ని పట్టుకొని ఆయన పారిపోతుంటే పట్టుకున్నామని చెప్పడం పోలీసులు ఊడిగానికి నిదర్శనమన్నారు. 

read more   ఏపీ ఈఎస్ఐ స్కాం: పితాని కొడుకు సురేష్ కోసం ఏసీబీ గాలింపు

కొల్లు రవీంద్ర పై బురదజల్లాలని చూడటం, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం ఎవరి తరం కాదన్నారు. పేర్నినాని కి చేతనైతే రవీంద్రతో పాటు అభివృద్ది పనుల్లో పోటీ పడాలన్నారు. ప్రభుత్వం ఈ విధంగా టీడీపీ నేతల అరెస్ట్ కోసం చేసే కుటిల  ప్రయత్నాలను ఆధారాలతో సహా బయటపెడుతూనే ఉంటామని పట్టాభి తేల్చిచెప్పారు. 

బందరు పోర్టుని తీసుకొచ్చి మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేలా రవీంద్ర పనిచేశాడని, అలాంటి పని ఒక్కటైనా పేర్నినాని చేశాడా అని టీడీపీనేత నిలదీశారు. తక్షణమే జిల్లా ఎస్పీ పెడన, గూడూరు పీఎస్ లలలోని సీసీ టీవీ పుటేజ్ బయటపెట్టాలని... 29నే నిందితులు లొంగిపోతే 2వతేదీన అరెస్ట్ చేసినట్లు ఎందుకు చెప్పారో స్పష్టం చేయాలన్నారు.  పోలీసులు తయారుచేసిన ఎఫ్ఐఆర్ లో ఏ5స్థానంలో ఉన్నవారెవరో బయటపెట్టాలని పట్టాభిరాం  డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios