అమరావతి: ప్రభుత్వ పథకాలన్నీ సంతృప్తికర స్థాయిలలో అమలు కావాలని అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగవద్దని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
శుక్రవారం నాడు సీఎం వైఎస్ జగన్ అమరావతిలో  సీఎంఓ అధికారులతో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. 

పథకాలు అందని ఎవరైనా ఉంటే పథకాల అమలు తేదీ నుండి నెల రోజుల్లోగా ధరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత ఉన్నవారికి పథకాలకు వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. వెంటనే వారి వారి ఖాతాల్లో నగదు బదిలీ చేయాలని ఆదేశించారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం ఈ ఆదేశాలిచ్చారు. 

 గత జూన్‌లో వివిధ పథకాలు అమలు చేశామన్నారు., కోవిడ్‌ కష్టకాలంలో ఆదుకునేందుకు ఏడాది ముగియక ముందే అమలు తేదీలను ముందుకు జరిపి మరీ పథకాలు అమలు చేసినట్టుగా తెలిపారు.జాబితాలో తమ పేరు లేకపోతే ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సీఎం చెప్పారు. 

గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. ఆ దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులకు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

also read:ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం: కీలకాంశాలపై చర్చ

గత నెల 4వ తేదీన ‘వైయస్సార్‌ వాహనమిత్ర’, 10న ‘జగనన్న చేదోడు’, 20వ తేదీన ‘వైయస్సార్‌ నేతన్న నేస్తం’, 24న ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకాలను ప్రభుత్వం అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వాహనమిత్ర పథకాన్ని నాలుగు నెలలు ముందుగా, నేతన్న నేస్తాన్ని ఆరునెలలు ముందుగా ప్రభుత్వం అమలు చేసింది. 

వైయస్సార్‌ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికీ రూ.24వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసినట్టుగా సీఎం తెలిపారు. గత ఏడాది డిసెంబరులో ఈ పథకాన్ని అమలు చేసినట్టుగా ఆయన చెప్పారు. 

also read:రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదులు:హైకోర్టులో ఎంపీ క్వాష్ పిటిషన్లు

ఈ ఏడాది కోవిడ్‌ కష్టాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగో లేనప్పటికీ ఆరు నెలలు ముందుగా అమలు చేశామన్నారు. గత డిసెంబరు తర్వాత మగ్గం పెట్టుకున్న వారినీ పరిగణనలోకి తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

అలాగే ఈ ఏడాది జూన్‌ 20న పథకం అందలేదని భావించిన వారు ఎవరైనా ఉంటే, వారి దరఖాస్తులను కూడా పరిశీలించి నేతన్న నేస్తం కింద రూ.24వేల చొప్పున అందించాలని సీఎం ఆదేశించారు.