మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు.

అయితే రవీంద్రను జైలుకు తరలించడంపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. దీంతో ఆయన ఉదయం నుంచి గూడూరు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. ఏ జైలుకు తరలించాలనే అంశంపై క్లారిటీ లేకపోవడంతో పోలీసుల్లో అయోమయం నెలకొంది.

చివరికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో తమ అధికార పరిధి, అధికారాలపై ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.

కాగా.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య జరిగిందని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. శనివారం భాస్కరరావు హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు.

రాజకీయపరమైన, కులపరమైన అధిపత్యపోరులో భాగంగానే పక్కా పథకంతో భాస్కరరావును హతమార్చారని ఎస్పీ చెప్పారు. నేనున్నా ఏం జరిగినా నేను చూసుకుంటా నా పేరు రాకుండా హతమర్చమని రవీంద్ర ముద్దాయిలను ప్రోత్సహించారని తెలిపారు.

రవీంద్ర ప్రోత్సాహంతోనే ముద్దాయిలు హత్యకు పాల్పడ్డారని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని అరెస్ట్ చేశామని.. వీరిలో ఒకరు కొల్లు రవీంద్ర, మరో మైనర్ బాలుడు ఉన్నాడన్నారు.

అత్యవసరమైతే నాకు ఫోన్ చేయకండి, నా పీఎలలో ఎవరికైనా ఒకరికి ఫోన్ చేయండని రవీంద్ర నిందితులకు చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు. హత్య జరగక ముందు కూడా నిందితులు పీఎ ద్వారా రవీంద్రతో మాట్లాడారని వెల్లడించారు.

హత్య జరిగిన పది నిమిషాల తర్వాత నిందితుల్లో ఒకరైన నాంచారయ్య .... పీఎకు ఫోన్ చేసి రవీంద్రతో మాట్లాడాడని ఎస్పీ తెలిపారు. పనైపోయిందని నాంచారయ్య చెప్పగా జాగ్రత్తగా ఉండమని రవీంద్ర వారికి చెప్పారని వెల్లడించారు.

అన్ని రకాలుగా కొల్లు ప్రమేయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయనకు విచారణ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్లడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. అప్పటికే రవీంద్ర పరారవటంతో గాలింపు కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించామని రవీంద్రబాబు వెల్లడించారు.

చిలకలపూడి సీఐ వెంకట నారాయణ నేతృత్వంలోని బృందం రవీంద్రను తుని వద్ద అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. విచారణ జరిపి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని జిల్లా ఎస్పీ చెప్పారు.