మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణరాజు( కన్నబాబు) టీడీపీని వీడారు. శుక్రవారం సాయత్రం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు సుకుమార వర్మ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. వారి రాజీనామా లేఖలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర, రూరల్‌ జిల్లా అధ్యక్షులు కళా వెంకటరావు, పంచకర్ల రమేష్‌బాబులకు పంపినట్టు సుకుమారవర్మ తెలిపారు. తమ అనుచరులతో కలసి శనివారం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. తాజాగా కన్నబాబురాజు వైఎస్సార్‌సీపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధిష్టానం పలు దఫాలు ఆయనతో చర్చలు జరిపి పార్టీని వీడవద్దని ఒత్తిడి తెచ్చింది. అయితే తాను వైఎస్సార్‌సీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నానని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో మార్పు ఉండదని టీడీపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు కన్నబాబురాజు తెలిపారు.