ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే వ్యాపారాలు చేస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి లక్ష్మీనారాయణ ఆరోపించారు. జగన్‌ను ఆయన తల్లి, చెల్లెలే నమ్మడం లేదన్నారు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను ఆయన తల్లి, చెల్లెలే నమ్మడం లేదన్నారు. అలాంటప్పుడు ప్రజలు ఎందుకు నమ్మాలని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యవస్థలను నాశనం చేస్తూ.. అరాచక పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలనే తన కోరికను నెరవేర్చుకోవడానికి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని కన్నా ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే తన ప్లాన్‌ను అమల్లోకి తెచ్చారని.. ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే వ్యాపారాలు చేస్తోందని లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఎంతోమందిని చంపి.. తనను నమ్మాలని జగన్ అంటున్నారని ఆయన మండిపడ్డారు. సొంత బాబాయ్‌ని హత్య చేయించిన జగన్‌ను ప్రజలు ఎలా నమ్ముతారని కన్నా ప్రశ్నించారు.
కాగా.. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువ పడిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించడం.. ఈ కామెంట్స్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ సంగారెడ్డి సభలో ప్రస్తావించడంతో.. తెలుగు రాష్ట్రాల్లో భూముల విలువపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఏపీ భూముల విలువపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్ స్పందించారు. ఏపీలోని విశాఖపట్నంలో ఎకరా స్థలం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. హైదరాబాద్‌లో లేని రేట్లు విశాఖపట్నంలో ఉన్నాయని అన్నారు.
కేసీఆర్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో తమకు తెలియదని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను తీసుకుని కేసీఆర్ చెబితే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాలను కించపరచడం సరైనదని కాదని.. జాగ్రత్తగా మాట్లాడాలని కోరారు. ఇక, ఒక్కశాతం ఓటు లేని భాజపాతో కలిసి తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఏమీ సాధించలేరని విమర్శించారు.
