జగన్ ఓ సైకో సీఎం... చంద్రబాబుపై కోపంతో రైతులపై కుట్రలా.. : కన్నా సంచలనం
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకోయిజం మరోసారి బయటపడిందంటూ మాజీ మంత్రి, టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎక్కడ చంద్రబాబు నాయుడికి మంచిపేరు వస్తుందోనని పట్టిసీమ నుండి రైతులకు సాగునీరు అందకుండా వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జగన్ రెడ్డి సైకో అని తాను మొదటినుండి చెబుతున్నా... ఇప్పుడది స్ఫష్టంగా బయటపడిందని కన్నా అన్నారు.
వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచిపోయినా ఇప్పటివరకు నీటికాలువల మరమ్మతులు చేయలేదంటూ ప్రభుత్వంపై కన్నా ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ సర్కార్ పై ఆశలు వదిలేసి చాలాచోట్ల రైతులే చందాలు వేసుకుని కాలువలు బాగుచేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితులు చూస్తే రైతుల్ని ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని అనిపిస్తోందని అన్నారు.
గోదావరిలో నీటిమట్టం పెరగడంతో దవళేశ్వరం బ్యారేజీ నుండి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు... కానీ పట్టిసీమ నుండి ప్రకాశం బ్యారేజీకి నీరు విడుదల చేయడంలేదని కన్నా తెలిపారు. పట్టిసీమ చంద్రబాబు నిర్మించారు కాబట్టి దాని మోటార్లు ఆన్ చేయడానికి కూడా జగన్ అనుమతించడం లేదన్నారు. సాగునీరు అందక రైతులకు నష్టం జరిగినా సరే టిడిపికి మాత్రం పేరు రావద్దన్నది వైసిపి ప్రభుత్వం కుట్రగా కన్నా పేర్కొన్నారు.
Read More జగన్‌కు మరో తలనొప్పి, సత్తెనపల్లి వైసీపీలో అసమ్మతి గళం.. మంత్రి అంబటికి వ్యతిరేకంగా సీక్రెట్ భేటీ
పోలవరం లేటయినా సరే సాగునీటి కోసం రైతులు ఇబ్బంది పడకూడదనే చంద్రబాబు పట్టిసీమను నిర్మించారని కన్నా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును వైసిపి ప్రభుత్వం పూర్తిచేసే పరిస్థితి లేదు... అలాగే పట్టిసీమ నుండి నీటిని రైతులకు ఇచ్చేందుకు కూడా సుముఖంగా లేదన్నారు. వెంటనే పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని కన్నా డిమాండ్ చేసారు.
ఏపీలో పోలీసు వ్యవస్థ దిగజారి ప్రవర్తిస్తోందని మాజీ మంత్రి మండిపడ్డారు. డిజిపి సహా పోలీస్ ఉన్నతాధికారులంతా ప్రజల కోసం కాకుండా పాలకులకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. తన యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత దారుణమైన పోలీసు వ్యవస్థ ను చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలంటూ పోలీసులకు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేసారు.