సారాంశం
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్ రెడ్డి ఇంట్లో రహస్యంగా భేటీ కావడం కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల్లోని ఆశావహులు ముందుగానే తమకు నచ్చిన నియోజకవర్గాలపై కర్చీఫ్ వేసుకుని కూర్చొన్నారు. అంతేకాదు.. తమ బెర్త్ జోలికి వస్తే ఎవరిని సహించేది లేదని తేల్చిచెబుతున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీ ఏదైనా ఇదే పరిస్ధితి నెలకొంది. అధికార వైసీపీలో ఈసారి చాలా సిట్టింగ్‌లకు టికెట్ ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే సంకేతాలు పంపారు.
పనితీరు మెరుగుపరచుకోవాలని.. లేని పక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుందని హెచ్చిరించారు. వైనాట్ 175 అని జగన్ చెబుతున్నా.. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత లేదు. ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ALso Read: మీ కొడుకు బాధ్యత నాది , చిన్న విషయాలకు గొడవలొద్దు : పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై జగన్ సీరియస్
తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీలోనూ ఇదే పంచాయతీ నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్ రెడ్డి ఇంట్లో రహస్యంగా భేటీ కావడం కలకలం రేపుతోంది. గ్రామాల్లో మంత్రి అంబటి అనుచరులు పెత్తనం సాగిస్తున్నారని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌లు కూడా అంబటిని కలిసే అవకాశం వుండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు అంటున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.