అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ క్రైస్తవులు... ఈ ముగ్గురూ క్రైస్తవులైనప్పుడు హిందూ మతం విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం లేదన్నారు.

''మంత్రులు కొడాలి నాని వ్యాఖ్యలను సీఎం జగన్ ఎందుకు ఖండించ లేదు. ప్రభుత్వ విశృంఖలత్వం రాముని శిరచ్ఛేధనం దాకా తెచ్చింది. ఏపీలో ఆందోళనకరమైన వాతావరణం ఉంది. మెజార్టీ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బ తీస్తున్నారు జగన్. ఏ వర్గం మనోభావాలైన దెబ్బతింటే  ఆ వర్గం పక్షాన నిలబడతాం'' అన్నారు కాల్వ.

''దేవుడికే రక్షణ లేని అనాగరిక సమాజాన్ని స్థాపించేందుకే జగన్ ప్రయత్నం. రాముడు తల తీసేయడం అనాగరికమైన చర్య. ఈ దుర్ఘటనల వెనుక ఎవరున్నారో తేలాలి.  బ్రిటీష్ కాలంలో కూడా దేవాలయాలపై ఈ స్థాయిలో దాడులు జరగలేదు. చంద్రబాబు రామతీర్ధం వెళ్లే దాకా ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది.. ఎక్కడ గడ్డి పీకుతోంది. చంద్రబాబు పర్మిషన్ తీసుకుని వెళ్తే.. విజయసాయి అదే రోజు ఎందుకెళ్లారు...'' అని ప్రశ్నించారు.

read more రామతీర్థం : అసలు దోషులను వదిలేసి.. సూరిబాబుతో తెల్ల కాగితంపై సంతకాలా?..

''చంద్రబాబును రామతీర్ధం వెళ్లకుండా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకున్నా.. ప్రజలే తీసుకెళ్లారు. రామతీర్ధం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విశాఖ వెళ్లారు విజయసాయి రెడ్డి. ఆయనపై దాడికీ టీడీపీకి, చంద్రబాబుకేం సంబంధం. ఆలయాల రక్షణలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది..? హిందూ ధర్మంపై దాడి చేసే అధికారం సీఎం జగనుకు ఎవరిచ్చారు..?'' అని నిలదీశారు.

''సీఎం, హోంమంత్రి, డీజీపీల పర్యవేక్షణలోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. హిందూ ధర్మంపై ప్రభుత్వమే దాడులు జరుపుతోంటే ఎవరికి చెప్పాలి..?ఉత్తరాదిలో రాముని గుడి నిర్మిస్తోంటే.. ఏపీలో రాముని తల తీసేశారు. ఏపీలోని దేవాలయాలపై వరుస దాడుల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలి. సీబీఐ విచారణకు కేంద్రం తక్షణం ఆదేశించాలి'' అని డిమాండ్ చేశారు.