గుంటూరు: ప్రజా హక్కుల హననమే లక్ష్యంగా మొదలైన జగన్ రెడ్డి పాలన.. రాజ్యాంగ భక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజ్యాంగేతర శక్తిగా, రాక్షస మూకకు నాయకుడిగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నీరు. అడ్డగోలు ఉత్తర్వులివ్వడం, అడ్డొచ్చిన వ్యక్తులను, వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడం అనే పాలసీతో రాష్ట్ర భవిష్యత్తును జగన్ రెడ్డి అథ:పాతాళానికి నెట్టేస్తున్నారని వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశారు.

''అధికారంలోకి వచ్చీరాగానే ప్రజాభీష్టానికి విరుద్ధంగా ప్రజా వేధికను కుప్ప కూల్చడంతో మొదలు పెట్టిన జగన్ రెడ్డి.. చివరికి ప్రజాపాలనకు మూల స్తంభాలుగా భావించే శాసన వ్యవస్థను, కార్యనిర్వాహక వ్యవస్థను, న్యాయ వ్యవస్థనూ దిగజార్చేందుకు ఒడిగట్టారు. రాజ్యాంగబద్దంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను కూడా హైజాక్ చేసి.. ఎన్నికల సంఘాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నించడం అత్యంత హేయం'' అంటూ విమర్శించారు. 

''ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు కూడా స్వేచ్ఛగా నిర్వహించుకోలేని పరిస్థితిని జగన్ రెడ్డి సృష్టించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ హక్కుల్ని దిగజార్చేందుకు జగన్ రెడ్డి పూనుకోవడం సిగ్గుచేటు. ప్రభుత్వం తీసుకుంటున్న రాజ్యాంగేతర నిర్ణయాలతో   నిలబడే పరిస్థితి కల్పించారు'' అని గుర్తుచేశారు.

read more  ఆ విషయంలో జగన్ సర్కార్ దేశంలోనే టాప్.. మరో ఘనత సాధించిన ఏపీ..

''రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న శాసన మండలి ఛైర్మన్ ను మతం పేరుతో దూషించారు. మాతృ భాషలో అక్షరాలు నేర్చుకోవడమనే రాజ్యాంగ హక్కును ఇంగ్లీష్ మీడియం జీవోతో నాశనానికి ప్రయత్నించారు. న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసి.. ఆ వివరాలు మీడియాకు విడుదల చేసి రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కారు'' అని మండిపడ్డారు.

''స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాద్యతలను ఎన్నికల సంఘం నుండి హైజాక్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఎన్నికల నిర్వహణ తమ చేతుల్లో ఉండాలంటూ ఎన్నికల సంఘం విధులను కూడా హైజాక్ చేస్తున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను రక్తసిక్తం చేసి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. దాడులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఎదురించిన వారిని తప్పుడు కేసుల్లో ఇరికించారు. అర్ధరాత్రి ఇళ్లలో మద్యం బాటిళ్లు పెట్టి తెల్లారే సరికి కేసుపెట్టడం ద్వారా ఎన్నికల వ్యవస్థనే నాశనం చేసేందుకు పూనుకున్నారు'' అంటూ కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు.