ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రక్తసంబంధాలనే పట్టించుకోడు... ఇక ప్రజలను ఆయనెలా పట్టించుకుంటాడని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. 

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టిడిపి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సొంత కుటుంబసభ్యులనే పట్టించుకోని జగన్ రాష్ట్ర ప్రజలను పట్టించుకుంటాడని అనుకోవడం అవివేకమేనని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే కాదు తోబుట్టువున్న కూడా జగన్ పట్టించుకోవడం లేదన్నారు. తండ్రి, తల్లి, అక్క, చెల్లి లాంటి సంబంధాలు తెలియని వ్యక్తి జగన్ అంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 19న విజయవాడకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గం విజయవాడ పశ్చిమ ప్రాంతంలో లోకేష్ పాదయాత్ర కోసం జలీల్ ఖాన్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

వీడియో

ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ... ప్రకాశం బ్యారేజీ మీదుగా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి చేరుకుంటుందని అన్నారు. విజయవాడలో వన్ టౌన్ మీదుగా ప్రారంభమవుతుందన్నారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుండి నేటివరకు దిగ్విజయంగా సాగుతోందని... ఇకపైనా ఇలాగే సాగుతుందని అన్నారు. 

Read More తాడిపత్రి బాగు కోసం వంద కోట్లు ఇవ్వండి.. వెంటనే రాజీనామా చేస్తా - జేసీ ప్రభాకర్ రెడ్డి

ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జలీల్ ఖాన్ విరుచుకుపడ్డారు.ప్రజలకు అబద్దాలు చెప్పి జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నాడని అన్నారు. ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి దేశంలో మరెవ్వరూ లేరన్నారు. ప్రజలకు ముద్దులు పెట్టిమరీ మోసం చేసాడని అన్నారు. అహంకారం ఉన్న నాయకుడు ఎవరూ చరిత్రలో బాగుపడలేదు... జగన్ పరిస్థితి కూడా అంతేనని జలీల్ ఖాన్ మండిపడ్డారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 40 వేల ఎకరాలు ప్రజలు స్వచ్చందంగా ఇస్తే దానిని జగన్ నాశనం చేసాడన్నారు. విశాఖపట్నం ఎప్పటినుండో అభివృద్ధి చెందిందని... అక్కడ రాజధాని పెట్టి కొత్తగా అభివృద్ది చేయాల్సిందేమీ లేదన్నారు. కానీ తన దోపిడీ కోసమే రాజధానిని అక్కడికి తరలించాలని జగన్ చూస్తున్నారని జలీల్ ఖాన్ ఆరోపించారు. రాబట్టి తనకోసమే... చంద్రబాబు, లోకేష్ కోసమే కాదు పిల్లల భవిష్యత్ కోసం వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు జలీల్ ఖాన్.