కర్నూలు జిల్లాలో టిడిపి నేతల మధ్య సయోధ్య నీటిమీద రాతల్లాగే ఉన్నాయి. వారం రోజుల క్రితం స్వయంగా చంద్రబాబునాయుడే జిల్లా నేతలతో సమీక్షించి సర్దుబాటు చేసిన ఏమాత్రం ఉపయోగం కనబడలేదు. నేతల మధ్య ఐకమత్యం లేకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ దెబ్బతినటం ఖాయమని చంద్రబాబు చెప్పినా వారి చెవికెక్కటం లేదు. తాజాగా టిడిపి నేత ఇరిగెల రామ్ పుల్లారెడ్డి మాటలే అందుకు నిదర్శనంగా నిలిచాయి.

మీడియాతో ఇరిగెల మాట్లాడుతూ, ‘రానున్న ఎన్నికల్లో మంత్రి అఖిలప్రియ ఆళ్ళగడ్డలో ఓడిపోవటం ఖాయం’ అని చెప్పారు. ఆళ్ళగడ్డలో ఒకపుడు టిడిపి ఇన్చార్జిగా పనిచేసిన ప్రముఖ నేత ఇరిగెల రామపుల్లా రెడ్డి  బల్లగుద్ది మరీ చెబుతున్నారు అఖిలప్రియ గురించి. మంత్రి తన వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమన్నారు. మంత్రి వైఖరిపై చంద్రబాబుకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా ఉపయోగం కనబడలేదన్నారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు మండిపడ్డారు. కడప రోడ్డులోని ఆర్టీసి బస్టాండు ఖాళీ స్ధలంలో దుకాణాలు కట్టేందుకు ఎప్పుడో పిలిచిన టెండర్లను మంత్రి ఏకపక్షంగా రద్దు చేయటంపై మండిపడ్డారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి  పనులకు పిలిచిన టెండర్లను కూడా మంత్రి రద్దు చేయించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని అన్నీ వర్గాల్లోనూ అఖిలప్రియపై వ్యతిరేకత పెరిగిపోతోందని కూడా చెప్పారు.