మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం ఓ గేమ్ ప్లాన్ లో భాగమేనని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. అతడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరతాడనని నాలుగేళ్ల క్రితమే తాను తెలియజేసినట్లు గుర్తుచేశారు. ఇలా కాంగ్రెస్ లోకి తిరిగి కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకోవడం వల్ల ఆ పార్టీకి కేవలం ఒక్క ఓటు మాత్రమే లాభమని డొక్కా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక్క ఓటు పెరగడం మినహా కాంగ్రెస్‌కు ఏమీ లాభం లేదని ఎద్దేవా చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా కిరణ్ కుమార్ మూడున్నరేళ్ల పాటు పాలించి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ అవినీతిపై అప్పుడే తాను ప్రశ్నించినట్లు గుర్తుచేశారు. మా ఇద్దరిపైనా విచారణ జరపాలని అప్పట్లోనే గవర్నర్ కు లేఖ రాశానని అన్నారు. దేశంలో అత్యంత ధనికులైన రాజకీయ నాయకుల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకరని మాణిక్య వరప్రసాద్ రావు ఆరోపించారు.

తెలుగు దేశం పార్టీతో కిరణ్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తమ పార్టీలో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి బలమైన నాయకుడని, ఆయన సేవలను మాత్రమే టిడిపి వినియోగించుకుంటుందని డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు స్పష్టం చేశారు.