ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు తనయుడు డీకే శ్రీనివాసులు గురువారం నాడు భేటీ అయ్యారు. సుమారు 10 నిమిషాల పాటు శ్రీనివాసులు సీఎంతో భేటీ అయ్యారు.
తిరుమల: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు తనయుడు డీకే శ్రీనివాసులు గురువారం నాడు భేటీ అయ్యారు. సుమారు 10 నిమిషాల పాటు శ్రీనివాసులు సీఎంతో భేటీ అయ్యారు.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి డీకే శ్రీనివాసులును సీఎం జగన్ కు పరిచయం చేయించారు. డీకే శ్రీనివాసులు వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఈ భేటీ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.ఇదిలా ఉంటే తమ మధ్య భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని డీకే శ్రీనివాసులు ప్రకటించారు.
ఆనంద నిలయాన్ని అనంత స్వర్ణమయం చేయాలనేది తన తండ్రి డీకే ఆదికేశవులునాయుడు చిరకాలవాంఛ అని శ్రీనివాసులు చెప్పారు. ఇదే విషయాన్ని తాను సీఎం జగన్ తో చర్చించినట్టుగా ఆయన చెప్పారు. ఈ విషయమై సీఎం కూడ సానుకూలంగా స్పందించినట్టుగా ఆయన తెలిపారు.తన రాజకీయ భవిష్యత్తు గురించి తర్వాత మాట్లాడుతానని డీకే శ్రీనివాసులు ప్రకటించారు.
2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజంపేట ఎంపీ స్థానం నుండి డీకే శ్రీనివాసులు తల్లి డీకే సత్యప్రభ పోటీ చేశారు. మిథున్ రెడ్డి చేతిలో డీకే సత్యప్రభ ఓటమి పాలయ్యారు. 2014లో డీకే సత్యప్రభ చిత్తూరు నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో డీకే ఆదికేశవులునాయుడు టీడీపీలో, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన విషయం తెలిసిందే.
