విషాదం.. మహానాడు నుంచి వెడుతుండగా రోడ్డు ప్రమాదం.. టీడీపీ నాయకుడి మృతి.. గతంలో అన్నావదినలు కూడా...
మహానడు నుంచి వెడుతూ ఓ టీడీపీ నేత రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
అమలాపురం : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన మహానాడుకు హాజరై వెళుతున్న ఓ టీడీపీ నేత దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని సమనస పరిధిలోని రంగాపురానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరేళ్ల రామాంజనేయులు(51) మృతి చెందాడు. ఆయన రాజమహేంద్రవరంలో జరిగిన టిడిపి మహానాడుకు హాజరై.. ఆదివారం రాత్రి ఇంటికి వెళుతున్నాడు. ఈ సమయంలో కొత్తపేట దగ్గర మందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో రామాంజనేయులు మృతి చెందాడు. రామాంజనేయులుకు భార్య అంబామని, కొడుకు సందీప్, కూతురు ఫాల్గుణి ఉన్నారు. రామాంజనేయులు.. టిడిపి ఆవిర్భావం నుంచి కార్యకర్తగా ఉన్నారు. ఆయన మృతి వార్త తెలిసి.. సోమవారంనాడు పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప.. అమలాపురంమాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపి, ఓదార్చారు.
మంగళగిరిలో రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టిన కసాయి తండ్రి: నిందితుడు అరెస్ట్
ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ రామాంజనేయులు మృతి విషాదకరమని అన్నారు. టిడిపి తరఫున 10 లక్షల ఆర్థిక సహాయాన్ని రామాంజనేయులు కుటుంబానికి అందించడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడులు నిర్ణయించారని తెలిపారు. కాగా గతంలో విజయవాడలో జరిగిన టిడిపి సింహా గర్జన నుంచి వస్తూ రామాంజనేయులు అన్న కరెళ్ల సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి దంపతులు ఇలాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అది 1996లో జరిగింది. విజయవాడలో జరిగిన ఈ సభకు హైదరాబాదు నుంచి వస్తూ వీరు మృత్యువాత పడ్డారు.